- ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని కోర్టు ఆదేశం
- సీఈసీ రాజీనామా, సర్ నిలిపివేత కోసం ఆందోళనలు
- తిరంగా మార్చ్‌కు వెళ్లకుండా నేహా బోరా, దీప్కే నిర్బంధం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌కు వెళ్లకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు షరతులతో బెయిల్ లభించింది. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించకూడదని, రూ.50 వేల బాండ్ సమర్పించాలని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. దీంతో శనివారం ఆయన విడుదలయ్యారు. ఇదే మార్చ్‌కు వెళ్తూ నిర్బంధానికి గురైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను కూడా పోలీసులు తెల్లవారుజామున విడుదల చేశారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోశ్ రాంకాలను అనుమతి లేని నిరసన కేసులో ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో వారికి మద్దతుగా తిరంగా మార్చ్‌కు పిలుపునిచ్చారు. నిషేధాజ్ఞల నేపథ్యంలో శుక్రవారం నేహాను మండీ హౌస్ వద్ద, దీప్కేను జండేవాలన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీప్కేపై శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందంటూ బీఎన్ఎస్ఎస్లోని 126, 170 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేహాను ఐదు గంటలపాటు ఢిల్లీలో తిప్పి ఆర్కేపురం స్టేషన్‌కు తీసుకెళ్లారని, రాత్రంతా అక్కడే ఉంచి, న్యాయవాదులను కలవనివ్వలేదని, అనారోగ్యంతో ఉన్నా మందులు ఇవ్వలేదని ఏఐఎస్ఏ ఆరోపించింది. దీప్కేను ఇంటి సమీపంలో అదుపులోకి తీసుకున్నారని, ఆయన ఆచూకీ తెలియక అడ్వకేట్లు కలవలేకపోయారని సీజేపీ న్యాయ విభాగం ప్రతినిధి రత్నా సింగ్ అన్నారు. నేహా బోరా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిషేధాజ్ఞల ఉల్లంఘన ఆరోపణలపై పోలీసులు పెద్ద సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్ ప్లేస్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
