తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) ఆకస్మికంగా కన్నుమూశారు. ఇవాళ శనివారం ఉదయం (జూన్ 27, 2026న) చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుకు గురై ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 1953 జనవరి 7న జన్మించిన భాగ్యరాజ్.. సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇటీవలే ఆయన గురువుగా భావించిన దర్శకుడు భారతిరాజా మరణించగా, కేవలం 17 రోజుల వ్యవధిలోనే భాగ్యరాజ్ కూడా కన్నుమూయడం సినీ వర్గాలను విషాదంలో ముంచెత్తింది. కాగా.. భాగ్యరాజాను కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలిచేవారు. తెలుగులో అల్లరినరేష్ నటించిన 'పెళ్లైంది కానీ' సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. వెంకటేష్ క్లాసిక్ హిట్స్ 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'అబ్బాయిగారు', నాగార్జున నటించిన 'ఆఖరి పోరాటం' వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, కథ అందించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులుగా నిలిచారు.
