మళ్లీ ట్రంప్ టారిఫ్స్ రచ్చ.. అమెరికా కంపెనీలపై పన్నులు వేసే దేశాలపై 100% సుంకం

మళ్లీ ట్రంప్ టారిఫ్స్ రచ్చ.. అమెరికా కంపెనీలపై పన్నులు వేసే దేశాలపై 100% సుంకం

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి అలజడి రేగింది. అమెరికా టెక్ దిగ్గజాలను టార్గెట్ చేస్తూ డిజిటల్ సర్వీసెస్ పన్ను విధించాలని భావిస్తున్న దేశాలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. అమెరికన్ కంపెనీలపై ఎలాంటి డిజిటల్ పన్నులు వేసినా, సదరు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 100 శాతం టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు.

కొన్ని యూరోపియన్ దేశాలు అమెరికాకు చెందిన గూగుల్, ఆపిల్, అమెజాన్, మెటా లాంటి టెక్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ సర్వీస్ పన్నులను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ.. అనేక యూరోపియన్ దేశాలు అమెరికన్ కంపెనీలపై డిజిటల్ సర్వీసెస్ పన్నును త్వరలోనే అమలు చేయాలని చర్చలు జరుపుతున్నాయి. కొన్ని దేశాలు దీనికి చాలా దగ్గరగా కూడా వచ్చాయి. అయితే ఏ దేశమైనా సరే ఇలాంటి పన్ను విధిస్తే.. ఆ దేశం నుంచి అమెరికా వచ్చే ప్రతి వస్తువుపైనా వెంటనే 100% సుంకం ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఈ ప్రతిపాదిత టారిఫ్ ఎంత శక్తివంతమైనదంటే, సదరు దేశాలతో అమెరికాకు ఉన్న ప్రస్తుత, భవిష్యత్తు వాణిజ్య ఒప్పందాలన్నింటినీ ఇది అధిగమిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందాలు ఇప్పటికే కుదిరినా.. సంతకాలు చేసినా, చేయకపోయినా.. ఈ 100% సుంకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. తన దూకుడు వాణిజ్య విధానాల ద్వారా అమెరికా వ్యాపార ప్రయోజనాలను కాపాడటంలో ట్రంప్ ఎంత కఠినంగా ఉంటారో ఈ నిర్ణయం మరోసారి నిరూపించింది.

నిజానికి అంతర్జాతీయ టెక్ సంస్థలు తమ దేశాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని.. అందుకే అవి స్థానికంగా ఎక్కువ పన్నులు చెల్లించాలని యూరోపియన్ దేశాలు వాదిస్తున్నాయి. కానీ ఈ పన్నులు కేవలం అమెరికన్ కంపెనీలనే వివక్షతో టార్గెట్ చేస్తున్నాయని వాషింగ్టన్ మొదటి నుంచి తీవ్రంగా విమర్శిస్తోంది. తాజా హెచ్చరికతో అమెరికాకు తన యూరోపియన్ మిత్రదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ యూరప్ దేశాలు వెనక్కి తగ్గకపోతే, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ట్రేడ్ వార్ మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది.