అల్వాల్లో హైడ్రా కూల్చివేతలు.. 10 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అంటే మాటలా..!

అల్వాల్లో హైడ్రా కూల్చివేతలు.. 10 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అంటే మాటలా..!

సికింద్రాబాద్: అల్వాల్ పీఎస్ పరిధిలోని హస్మత్ పేట్ సర్వే నెంబర్ 1 ఛత్రిగడ్డలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన ఈ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.

భారీ పోలీసు బందోబస్తు నడుమ చర్యలకు ఉపక్రమించిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. స్థానిక పోలీసులతో కలిసి హైడ్రా సిబ్బంది జేసీబీల సహాయంతో కూల్చివేతలు ప్రారంభించారు.

10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాల తొలగింపు పూర్తయిన వెంటనే కంచె ఏర్పాటు చేసి ఈ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. ప్రభుత్వ స్థలాలు చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రాధికారులు హెచ్చరిస్తున్నారు.