కార్పొరేట్ ప్రపంచంలో తరతరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయాలను, అలవాట్లను జెన్ జెడ్ యూత్ పూర్తిగా మార్చేస్తోంది. పాత తరం ఉద్యోగులు ఆఫీసుల్లో మేనేజర్లను ప్రసన్నం చేసుకోవడానికి గంటల తరబడి అదనంగా కూర్చోవడం, వీకెండ్స్‌లో కూడా ఆఫీస్ కాల్స్ మాట్లాడటం వంటి వాటిని ఒక బాధ్యతగా భావిస్తే.. జెన్-జీ మాత్రం వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తోంది. ఈ అంశంపై రీసెంట్‌గా ఎంటర్‌ప్రెన్యూర్, కంటెంట్ క్రియేటర్ శీతల్ రిజ్వానీ ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శీతల్ తన పోస్ట్‌లో తన జెన్-జీ కజిన్, వారి ఆఫీస్ సహోద్యోగుల గురించిన ఒక ఆసక్తికరమైన స్టోరీని పంచుకున్నారు. ఈ యువ ఉద్యోగులంతా కలిసి ఒక ప్రత్యేకమైన గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారట. ఆఫీస్ టైమింగ్స్ ముగియగానే అందరూ ఒకేసారి బ్యాగులు సర్దుకుని ఆఫీస్ నుంచి బయలుదేరుతారని చెప్పారు. మేనేజర్ ముందు మార్కులు కొట్టేయడానికి అనవసరంగా ఒక్క నిమిషం కూడా ఆఫీస్‌లో కూర్చోరు. అంతేకాదు శని, ఆదివారాల్లో వచ్చే ఆఫీస్ ఫోన్ కాల్స్‌ను అస్సలు అటెండ్ చేయరు. ఒకవేళ మేనేజర్ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే.. భయపడి సైలెంట్‌గా ఉండిపోకుండా, నేరుగా హెచ్ఆర్ టీమ్‌కు కంప్లైంట్ చేస్తున్నారని వెల్లడించారు. విశేషం ఏమిటంటే.. హెచ్ఆర్ కూడా వీరి వైపే నిలబడి సదరు మేనేజర్‌కు వార్నింగ్ ఇస్తోందట.
ఈ స్టోరీలో అందరినీ ఆకర్షించిన మరో క్రేజీ సంఘటన ఉంది. ఒకరోజు ఆఫీస్‌లో ఏసీ పాడైపోతే.. ఈ జెన్-జీ బ్యాచ్ అంతా కలిసి ఏసీ రిపేర్ అయ్యేంతవరకు తాము పక్కనే ఉన్న కేఫేలో కూర్చుని వర్క్ చేసుకుంటాం అని హెచ్ఆర్‌కు తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఈ విషయాన్ని శీతల్ తన కజిన్‌ను అడగ్గా.. మిలీనియల్స్ ఇలాంటి ఇబ్బందులను భరించడానికి అలవాటు పడిపోయారని కానీ తాము అలా కాదని సమాధానం ఇచ్చాడట. శీతల్ ఈ పోస్ట్‌ను ‘ఎమోషనల్ డ్యామేజ్’ అనే ఫన్నీ క్యాప్షన్‌తో ముగించడంతో ఇది నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పాత తరం వారు ఆఫీసుల్లో గొడ్డు చాకిరీ చేయడాన్ని.. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడాన్ని సంస్థ పట్ల భక్తిగా భావించి తప్పులో కాలేస్తున్నారని కొందరు విమర్శించారు. జెన్-జీ యువత నైతిక విలువలకు, మానసిక ప్రశాంతతకు ఎక్కువ విలువ ఇస్తూ.. టాక్సిక్ వర్క్‌ప్లేస్ కల్చర్‌కు చరమగీతం పాడుతోందని మెజారిటీ నెటిజన్లు అభినందిస్తున్నారు. మొత్తానికి జెన్-జీ దెబ్బకు కార్పొరేట్ కంపెనీలు తమ పాత రూల్స్ మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
