తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జననాయగన్ సినిమా నిర్మాత, తన సన్నిహితుడు అయిన కే.వెంకట నారాయణ్ కు పిలిచి పదవి ఇచ్చారు. ఢిల్లీలో తమిళనాడు ప్రతినిధిగా నియమిస్తూ శనివారం (జూన్ 27) ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమన్వయ కర్తగా ఆయనను నియమించారు.
ఈ నియామకంపై విడుదల చేసిన జీవోలో.. నారాయణ తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది పాటు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నియామకానికి సబంధించిన విధివిధానాలు ప్రత్యేకంగా నోటిఫై చేయనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం విజయ్ హీరోగా నటించిన చివరి సినిమా.. జననాయగన్ కు నారాయణ నిర్మాత. హెచ్ వినోత్ డైరెక్షన్ లో.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తోంది. సెన్సార్ అభ్యంతరాల కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది.
నిర్మాత నారాయణతో సీఎం విజయ్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. జననాయగన్ సినిమా విడుదల కాని పరిస్థితుల్లో .. నిర్మాతకు అండగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యతపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో గవర్నర్ ఆర్ఎన్ రవి బదిలీ తర్వాత.. కొత్త గవర్నర్ గా ఆర్వీ అర్లేకర్ బాధ్యతలు తీసుకున్న సమయంలో.. విజయ్ తో పాటు నారాయణ వెళ్లటం విమర్శలకు దారి తీసింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జననాయగన్ కు సెన్సార్ బోర్డు నుంచి అడ్డంకులు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు సినిమా హై క్వాలిటీ ఫుటేజ్ లీక్ అవ్వడం కూడా మరో ఎదురుదెబ్బ. సినిమా పరంగా ఎలా ఉన్నా.. తన నిర్మాతకు అండగా ఉంటూ వస్తున్న విజయ్.. కీలక పదవి ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ నియామకంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినీ నిర్మాతకు కీలక పదవి ఇవ్వటం వలన.. సీఎం ఆఫీస్ పై అభిప్రాయం మారుతుందని డీఎంకే రాజ్యసభ ఎంపీ పీ.విల్సన్ మండిపడ్డారు.
కేంద్రంలో తమిళనాడు ప్రతినిధి అంటే చాలా కీలక బాధ్యతలుంటాయి. ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు మధ్య అనుసంధాన కర్తగా ఉండాలి. అభివృద్ధి పనులకు సంబంధించి.. పాలసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరించే విధంగా రాయబారం నడపాలి. పార్లమెంట్ సెషన్స్ సందర్భంంగా ఎంపీలకు సహాయపడాల్సి ఉంటుంది. సినీ నిర్మాత ఇవన్నీ చేయలగరా..? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పదవులకు సినిమా వాళ్లను పెట్టడం వలన రాష్ట్రం నవ్వుల పాలవుతుందని విమర్శించారు.
