కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో చెత్త లొల్లి.. రోడ్డు పక్కన చెత్త పడేయొద్దు అన్నందుకు..

కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో చెత్త లొల్లి.. రోడ్డు పక్కన చెత్త పడేయొద్దు అన్నందుకు..

హైదరాబాద్: కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో రోడ్డుపై చెత్త వేస్తున్న మహిళను పారిశుద్ధ్య సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో.. చెత్త పడేసిన సదరు మహిళా పారిశుద్ధ్య సిబ్బందిపై దాడికి దిగింది. బూతులు తిడుతూ మహిళా కార్మికురాలిపై చేయి చేసుకోవడంతో నడి రోడ్డుపై నానా రచ్చ జరిగింది. 

దీంతో వాహనం నెంబర్ గుర్తించి సదరు మహిళపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సర్కిల్ డీసీ (సర్కిల్ 51 ఆల్విన్ కాలనీ) చాముండేశ్వరి హెచ్చరించారు.

డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను తొలగించిన సంగతి తెలిసిందే. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను కాల్చడం, కాల్వల్లో వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, రోగాల బారిన పడతామని అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు.

చెత్త సేకరించడానికి ఇంటి ముందుకు బండ్లు వస్తు్న్న సమయంలో నిర్లక్ష్యంగా ఉండి.. వారికి నచ్చిన సమయంలో నచ్చిన చోట చెత్త పడేస్తుండటంతో పారిశుద్ధ్య సిబ్బందికి తలనొప్పిగా మారింది. అందుకే.. చెత్త ఇలా పడేయొద్దని మర్యాదగా చెబుతున్నప్పటికీ కొందరు ఇలా దాడులకు తెగబడుతున్నారు.