- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడ్డ ఈఎస్ మల్లారెడ్డి
- ఇప్పుడు సీఐ డైరీ బయటకు రావడంతో ఎక్సైజ్ శాఖలో దుమారం
నిజామాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్‌సూపరింటెండెంట్ కొమ్ము మల్లారెడ్డి ఏసీబీకి పట్టుబడిన వెంటనే జిల్లాకు చెందిన ఎక్సైజ్సీఐ మామూళ్ల చిట్టా రాసుకున్న డైరీ బయటపడడం సంచలనంగా మారింది. కల్లు దుకాణాల నుంచి నెలకు దాదాపు రూ.3 లక్షలు వసూలు చేస్తున్న ఆ సీఐ ఎవరి నుంచి ఎంత వసూలు చేశారో డైరీలో క్లియర్‌గా రాసుకున్నారు. వారి నుంచి ఇంకా ఎంత ఎక్కువ వసూలు చేయాలో కూడా అందులో నోట్చేసుకున్నారు.
సీఐ డైరీలో రహస్యంగా దాచుకున్న చిట్టా ఆ శాఖ ఉద్యోగి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా... అది వైరల్‌గా మారింది. కల్లు దుకాణాల నుంచే నెలకు రూ. లక్షలు వసూలు చేసిన అధికారి బార్లు, వైన్స్‌లు, బెల్ట్‌షాప్ ల నుంచి ఇంకెంత వసూలు చేశారన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్జిల్లాలో 102 వైన్స్, 19 బార్లు ఉండగా అమ్మకాలను పెంచేందుకు ఎక్సైజ్అధికారులే వైన్స్ ఓనర్లను ఒప్పించి బెల్ట్‌షాపులను ఎంకరేజ్ చేస్తున్నారు.
పర్మిట్‌రూమ్‌ల నుంచి నెలకు రూ.25 వేలు, బెల్ట్ షాప్ నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. బార్ ఓనర్ల నుంచి కూడా నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేలు తీసుకుంటున్నారు. కల్లు వ్యాపారుల నుంచి లంచాలు దండుకుంటున్న అధికారులు కల్తీ కల్లు దందాకు సహకరిస్తున్నారు. ఒక్కో షాప్‌నుంచి నెలకు రూ.20 వేలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి.
జిల్లాలో ఏడుగురు ఎక్సైజ్సీఐలు, 17 మంది ఎస్ఐలు, సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐలు వసూలు చేసిన మామూళ్లలో మూడు శాతం పైఅధికారులకు, కానిస్టేబుళ్లకు 20 శాతం పంచి మిగతా అమౌంట్ సీఐ, ఎస్ఐలు పంచుకుంటున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో ప్రతి నెలా రూ.కోటి వరకు మామూళ్ల దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
