జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కలకలం సృష్టించిన కవల శిశువుల దత్తత, విక్రయ వ్యవహారం ఇప్పడు తీవ్ర చర్చనీయాంశమైంది. బిడ్డను కనాలన్న ఆశ తీరకముందే... ప్రసవ సమూయంలో దురదృష్టవశాత్తు గంగజల అనే వివాహిత లోకం విడిచివెళ్లింది. గంగజల మరణంతో ఆ శిశువుల తండ్రి సాయిలుకు ఆ ఇద్దరు కవల పిల్లల అలనాపాలన భారంగా మారింది.
ఈ నిస్సహాయతను ఆసరాగా చేసుకున్న ఓ మహిళ... పిల్లలను దత్తత ఇవ్వాలని సాయిలును కోరింది. ఆ తర్వాత ఓ న్యాయవాది ద్వారా నోటరీ చేయించి, ఇద్దరు పిల్లలను వేర్వేరు కుటుంబాలకు దత్తత పేరుతో అప్పగించారు. అయితే ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
►ALSO READ | జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో... డ్రైవర్ నిర్లక్ష్యం... బ్రేక్ సెట్టింగ్ చేస్తున్న మెకానిక్ మృతి...!
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారుల జోక్యంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు... తండ్రి సాయిలుతో పాటు పిల్లలను దత్తత తీసుకున్న రెండు కుటుంబాలను విచారణ నిమిత్తం పిలిపించారు. ఆపై ఆ ఇద్దరు శిశువులను భద్రత దృష్ట్యా సిద్ధిపేట శిశు గృహానికి తరలించారు.
చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా, ఇష్టానుసారంగా వ్యవహరించిన తండ్రి సాయిలు, పిల్లలను దత్తత తీసుకున్న రెండు కుటుంబాలు..దత్తత పత్రాలు నోటరీ చేసిన న్యాయవాదిపై రాయికల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.
