ఛీ ఛీ ఇదేం బ్యాటింగ్.. పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్!

ఛీ ఛీ ఇదేం బ్యాటింగ్.. పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్!

IND vs IRE 1st T20I: బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు (జూన్ 26న, శుక్రవారం) జరిగిన మొదటి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలోనే టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌పై వాళ్లకు ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. గత 17 ఏండ్ల టీ20 హిస్టరీలో ఇండియాను ఐర్లాండ్ ఓడించడం ఎప్పుడూ జరగలేదు, కానీ ఇవాళ ఆ రికార్డు బద్దలైంది.

కొంపముంచిన భారత్ బౌలింగ్: 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. ఐర్లాండ్ టీమ్‌ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగుల వద్ద కట్టడి చేసింది. యంగ్ బౌలర్ హర్షిత్ రాణా ప్లానింగ్‌తో బౌలింగ్ చేసి 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అతను ఒక్క వికెట్ కూడా తీయకుండా తన 4 ఓవర్లలోనే ఏకంగా 57 రన్స్ సమర్పించుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఆ జట్టు కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 36 బంతుల్లో 50 రన్స్ చేయగా.. గారెత్ డెలానీ 32 బంతుల్లో 49 రన్స్‌తో కిరాక్ ఇన్నింగ్స్ ఆడి వాళ్ల టీమ్‌కు భారీ స్కోరు అందించారు. ఇక ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్న 15 ఏండ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు.

148 పరుగులకే టీమిండియా ఆలౌట్:  

183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ఐర్లాండ్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేసి వన్-మ్యాన్ షో ప్రదర్శించాడు. కానీ అవతలి ఎండ్ నుంచి అతనికి ఏ ఒక్క ప్లేయర్ కూడా సపోర్ట్ ఇవ్వలేదు. ఒకరి వెనుక ఒకరు అల్లాటప్పాగా వికెట్లు పారేసుకోవడంతో.. భారత్ 18.5 ఓవర్లలోనే కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.