తక్కువ ధరకు.. విదేశీ బంగారం అంటూ రూ.30 లక్షల మోసం..పాతబస్తీ గోల్డ్ మ్యాన్ సూర్యపై కేసు

తక్కువ ధరకు.. విదేశీ బంగారం అంటూ రూ.30 లక్షల మోసం..పాతబస్తీ గోల్డ్ మ్యాన్ సూర్యపై కేసు

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించిన నకిలీ 'గోల్డ్ మెన్' సూర్యభాయ్ ముఠా గుట్టు రట్టయింది. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే కిలో బంగారం ఇస్తానంటూ నమ్మబలికి.. ఏకంగా రూ.30 లక్షలు నొక్కేసిన ఒక భారీ మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

అసలు ఏం జరిగిందంటే.. పాతబస్తీకి చెందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ 'గోల్డ్ మెన్' సూర్యభాయ్‌ను ఫిబ్రవరి 10న కృష్ణమాచారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు హిమాయత్‌నగర్‌లోని ఒక హోటల్‌లో కలిశారు. ఆ సమయంలో.. తనకు పెద్ద పెద్ద బంగారం వ్యాపారులతో సత్సంబంధాలు ఉన్నాయని, విదేశాల నుండి తక్కువ ధరకే తేవచ్చని సూర్యభాయ్ వారికి ఆశ చూపించాడు.

మార్కెట్‌లో కిలో బంగారం ధర సుమారు కోటిన్నర రూపాయలు ఉంటే.. తనకు ఉన్న పరిచయాలతో కేవలం ఒక కోటి రూపాయలకే కిలో బంగారం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆ మాయమాటలు నమ్మిన బాధితులు.. విడతల వారీగా మొత్తం రూ.30 లక్షలు అతనికి సమర్పించుకున్నారు. ఆ తర్వాత బంగారం రాకపోగా.. ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

►ALSO READ | గుడ్ న్యూస్: కేంద్ర స్ట్రీట్ ఫుడ్ హబ్ ప్రాజెక్టుకు సైబరాబాద్ ఎంపిక.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోండి

మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు.. ఘటనా స్థలం ఆధారంగా నారాయణగూడ పోలీసులకు బదిలీ అయింది. దీనిపై రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు.. సూర్యభాయ్‌పై సెక్షన్ 318(4), 316(2) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.అలాగే ఈ కేసులో మరింత సమాచారం కోసం ఫిర్యాదుదారులకు కూడా BNSS సెక్షన్ 94 & 179 కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. మూడు రోజుల్లోగా జరిగిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించాలని ఆదేశించారు.ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితుడు సూర్యభాయ్‌ను కూడా స్టేషన్‌కు పిలిపించి, విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ సైదేశ్వర్ వెల్లడించారు.