క్రాప్ బుకింగ్లో కాకిలెక్కలు!.. రైతులు ఒక పంట వేస్తే మరో పంటగా నమోదు

క్రాప్ బుకింగ్లో కాకిలెక్కలు!.. రైతులు ఒక పంట వేస్తే మరో పంటగా నమోదు
  • సాగైన పంటలనూ నమోదు చేయడంలో ఏఈవోల నిర్లక్ష్యం 
  • ఎరువుల సప్లై, ధాన్యం, పత్తి సేకరణలో అంచనాలు తారుమారు
  • పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు అన్నదాతలకు తిప్పలు 
  • ఈసారైనా క్రాప్​ బుకింగ్​కచ్చితంగా జరిగేనా...? 

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో పంటల నమోదు(క్రాప్​ బుకింగ్) ప్రక్రియ తప్పుల తడకగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో వ్యవసాయ శాఖ ఏఈవోల ద్వారా క్రాప్​ బుకింగ్​ నిర్వహిస్తుంది. ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వం ఆయా సీజన్లలో విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయడంతో పాటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతుంది. రైతులు వేసిన పంటలకు అవసరమైన ఎరువులు సమకూర్చుకోవాలన్నా, బ్యాంకుల్లో క్రాప్​లోన్లు పొందాలన్నా, పండించిన పంటను అమ్ముకోవాలన్నా ఈ డేటానే కీలకంగా మారుతుంది. కానీ కొంతమంది ఏఈవోలు తూతూమంత్రంగా క్రాప్​బుకింగ్​ నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫీల్డ్​కు వెళ్లి రైతులు ఏ పంట వేశారో చూడకుండా ఆఫీసుల్లో కూర్చుని కాకిలెక్కలు సమర్పిస్తున్నారు. రైతులు ఒక పంట వేస్తే ఏఈవోలు మరో పంటను నమోదు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్​ క్రాప్​సర్వే(డీసీఎస్) కూడా లోపభూయిష్టంగా సాగుతోంది. దీంతో పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను అగచాట్లు పెడుతోంది. మళ్లీ వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈసారైనా కచ్చితమైన సమాచారంతో క్రాప్​ బుకింగ్​చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. 
 

ఇదీ పరిస్థితి...

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కొత్తపల్లిలో 763 ఎకరాలు, దస్నాపూర్​లో 2,435 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. రైతులు గత యాసంగి సీజన్​లో దాదాపు 540 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రభుత్వం రెండు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసింది. కానీ ఈ రెండు గ్రామాల్లో పంటలు సాగు చేసినట్టు క్రాప్​ బుకింగ్​లో నమోదు కాలేదు. దీంతో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు ఇరవై రోజుల పాటు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాశారు. చివరకు కౌలు రైతుల పేరిట టెంపరరీ రిజిస్ట్రేషన్​ చేయించుకొని ధాన్యం అమ్ముకున్నారు. అలాగే కోటపల్లి మండలం ఆలుగామకు చెందిన ఓ రైతు తనకున్న ఎకరంన్నర పొలంలో ఏటా వరి పంట సాగు చేస్తున్నాడు. కానీ ఆ రైతు పేరిట పత్తి పంట వేసినట్టుగా క్రాప్​ బుకింగ్​లో నమోదు చేశారు. ధాన్యం అమ్ముకునే క్రమంలో క్రాప్​ బుకింగ్ ​డేటా చూస్తే వరి కాకుండా కాటన్​ వేసినట్టుగా చూపింది. దీంతో ఇతరుల పేరిట వడ్లు అమ్ముకోగా, పేమెంట్​ కోసం ఇబ్బందులు పడ్డట్టు సమాచారం. ఇలా క్రాప్​ బుకింగ్​ డేటాలో తప్పుల కారణంగా రాష్ట్రంలో అనేక మంది రైతులు అవస్థలు పడుతున్నారు. 
 

డీసీఎస్​లోనూ లోపాలు

కేంద్ర ప్రభుత్వం శాస్ర్తీయ పద్ధతిలో జియో ట్యాగింగ్ ద్వారా చేపడుతున్న డిజిటల్​ క్రాప్​సర్వే(డీసీఎస్) సైతం నామమాత్రంగా సాగుతోంది. మొదట్లో ఏఈవోల ద్వారా డీసీఎస్​ చేపట్టగా తమకు పనిభారం పెరుగుతోందంటూ ఆందోళనబాట పట్టారు. దీంతో ఈ పనిని గ్రామాల్లోని వాలంటీర్లకు అప్పజెప్పారు. వారు క్షేత్రస్థాయిలో పొలాలకు వెళ్లి రైతులు ఏ పంట వేశారో నమోదు చేస్తూ జియో ట్యాగింగ్​ చేయాల్సి ఉంటుంది. వారికి ఒక్కో రిజిస్ట్రేషన్​కు రూ.7 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ అగ్రికల్చర్​ అధికారులు చేతులు దులిపేసుకోవడంతో ఈ ప్రక్రియ కూడా సరిగా సాగడం లేదు. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన సమాచారం అందకపోవంతో వ్యవసాయ ప్రణాళిక గాడితప్పుతోంది. రైతులు పంటలు వేసినప్పుడే కచ్చితమైన విస్తీర్ణం, సాగు వివరాలు నమోదు చేస్తే ఏ పంటకు ఎంత ఎరువు అవసరమవుతుంది? వరి, పత్తి కొనుగోలు సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేయాలి? అనే అంచనాలకు అవకాశం ఉంటుంది. పంట విక్రయంలో రైతులకు అవస్థలు తప్పుతాయి.