జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామక పరీక్షల వివాదం తీవ్రరూపం దాల్చింది. ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా నిరుద్యోగ విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ పోరాటంలో భాగంగా గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, జేఎల్‌కేఎం నేత దేవేంద్ర నాథ్ మహ్తో ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
గత కొన్ని రోజులుగా జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ దేవేంద్ర నాథ్ మహ్తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, తొమ్మిది రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు, అనుచరులు ఆయన్ని రాంచీలోని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
►ALSO READ | పన్నెండేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పోరేట్ రుణాలు మాఫీ: ప్రభుత్వ ప్రకటన
మరోవైపు దేవేంద్ర మహ్తో దీక్షకు మద్దతుగా సోమవారం నాడు నిరుద్యోగ విద్యార్థులు తలపెట్టిన విధానసభ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాసనసభను ముట్టడించేందుకు వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు, బాష్పవాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో పలువురు విద్యార్థులతో పాటు ఆందోళనకారులు గాయపడ్డారు.
14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలతో పాటు అన్ని ప్రభుత్వ నియామక పరీక్షలలో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వ తీరు మారే వరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవేంద్ర మహ్తో ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, జార్ఖండ్‌లో ఈ ఉద్యమం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.
