అమరావతి: తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణానికి 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవలకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. దేశంలోనే తొలిసారిగా తల్లీ బిడ్డల భద్రత, ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని అత్యాధునిక వాహనాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రూపురేఖలు, బ్రాండింగ్‌ను ఖరారు చేశారు. తల్లులు, నవజాత శిశువులు సులభంగా ఎక్కడం, దిగడం, ప్రయాణంలో భద్రత, అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు రూపొందిస్తున్నారు.
ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువులకు ఎదురయ్యే రవాణా సమస్యను తొలగించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, అధిక ప్రమాద (హైరిస్క్) గర్భిణులకు అవసరమైన సమయంలో రవాణా అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యం. కొత్త వాహనాల ప్రారంభ కార్యక్రమం ఆగస్టు 11న నరసరావుపేటలో జరగనుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన వాహన సేవలను ప్రారంభించనున్నారు.
రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమా నికి అనుగుణంగా జిల్లాల్లోనూ కొత్త వాహనాల సేవలు ప్రారo భం కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసావాలకు గర్భిణులకు మాత్రమే సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన వారికి మాత్రమే:
రాష్ట్రవ్యాప్తంగా '102 ' (తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు) సేవల్ని ఆధునిక విధానం మరింత విస్తరించేందుకు ప్రభుత్వం మొత్తం 500 వాహనాలను సమకూర్చుతోంది. తొలిదశలో 300 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మిగిలిన 200 వాహనాలను త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సదరు జిల్లాల్లో ప్రసవాల ఆధారంగా ఈ వాహనాలు కేటాయించారు.
►ALSO READ | పాపం.. చీరాల బీచ్కు వెళ్తుంటే ఘోరం జరిగిపోయింది.. డీసీపీ కూతురు స్పాట్ డెడ్
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన తల్లి, నవజాత శిశువును ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చే డ్రాప్‌బ్యాక్ సేవ పూర్తిగా ఉచితం. తల్లితోపాటు ఇద్దరు సహాయకులు కూడా ప్రయాణించవచ్చు. అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో రక్తమార్పిడి అవసరమైన గర్భిణులకు ప్రత్యేక పికప్, డ్రాప్‌బ్యాక్ సేవలు అందిస్తారు. 2025–26లో '102 ' సేవల ద్వారా 2,05,914 ప్రయాణాలు నిర్వహించారు.
ఇందులో 1,65,093 ప్రసవానంతర డ్రాప్‌బ్యాక్ ప్రయాణాలు, 40,821 హైరిస్క్ గర్భిణుల రవాణా సేవలు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలను consortium of విద్యవేద ఫౌండేషన్ అండ్ మెసర్స్ శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ (vvf-stt consortium)కు తాజగా ప్రభుత్వం అప్పగించిoది. ఈ సంస్థనే సొంత వాహనాలను నడుపుతోoది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో '102' 'సేవల కోసం ప్రభుత్వం రూ.37.40 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్‌ను కేటాయించింది.
భద్రతకు అధునాతన ఫీచర్లు
కొత్త వాహనాలు ఎయిర్ కండిషన్డ్ ఎస్‌యూవీ/ఎంయూవీ తరహాలో ఉంటాయి. గర్భిణులు, బాలింతలు సులభంగా ఎక్కేందుకు ప్రత్యేక ఫుట్‌రెస్టులు, లోపల పట్టుకునేందుకు హ్యాండ్‌రెయిల్స్ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాల్లో రక్షణగా ఉండేoదుకు వాహనాల పక్కల కలిపి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.
వెనుక సీట్లకు సీట్‌బెల్టులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ లాక్ స్లైడింగ్ డోర్లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌పీ, 80 కి.మీ. వేగం దాటితే హెచ్చరించే స్పీడ్ అలర్ట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి. వాహనాల్లో ఉష్ణోగ్రత నియంత్రణతో కూడిన ఏసీ ఉంటుంది. నవజాత శిశువుకు అనుకూలమైన ఉష్ణోగ్రత ఉండేలా దీనిని రూపొందించారు.
అత్యవసరమైతే.. ఎస్‌ఓఎస్
గర్భిణి కూర్చున్న సీటు వద్దే ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ బటన్ ఏర్పాటు చేశారు. నొక్కగానే 102 కాల్‌సెంటర్‌కు సమాచారం చేరుతుంది. వాహనం ఉన్న ప్రదేశాన్ని లైవ్ జీపీఎస్ ద్వారా కంట్రోల్ సెంటర్‌కు పంపే వీలుంది. అవసరమైతే సమీప ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసి వైద్య సహాయం అందిస్తారు.
వాహనాల్లో ఏఐఎస్–140 ప్రమాణాలకు అనుగుణమైన జీపీఎస్/వీఎల్‌టీడీ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. జీపీఎస్‌తో పాటు భారత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ ద్వారా ద్వంద్వ ఉపగ్రహ కవరేజీ లభిస్తుంది. డ్యూయల్ సిమ్ 4జీ, నెట్‌వర్క్ లేని సమయంలో సమాచారాన్ని నిల్వ చేసే ఆఫ్‌లైన్ డేటా సదుపాయం, బ్యాకప్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.
ప్రయాణంలోనే ఆరోగ్య సూచనలు
ప్రయాణంలో ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, హ్యాండ్ శానిటైజర్, టిష్యూ పేపర్, స్టెయిన్‌లెస్ స్టీల్ డస్ట్‌బిన్, ఫస్ట్‌ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచారు. ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ఆడియో వ్యవస్థ ద్వారా ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, తల్లిపాలు, శిశువుల పోషణ, టీకాలు, ప్రమాద సంకేతాలు, ఆరోగ్య జాగ్రత్తలపై ప్రభుత్వ సూచనలు వినిపిస్తాయి.
డ్రైవర్ యాప్ మ్యాపింగ్, కాల్‌సెంటర్ అనుసంధానం, ఆర్‌సీహెచ్ (RCH) ధ్రువీకరణలను ఐటీ వ్యవస్థలోకి తీసుకొచ్చారు. జీపీఎస్ ద్వారా వాహనం ఎక్కడ ఉందో తెలుసుకుని, అందుబాటులో ఉన్న వాహనాన్ని అవసరమైన చోటుకు కేటాయించడం, ప్రయాణాన్ని పర్యవేక్షించడం సులభమవుతుంది. రాష్ట్రంలోని ఏ ఫోన్ నుంచైనా టోల్‌ఫ్రీ 102ను సంప్రదించవచ్చు.
