నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం సృష్టించింది. గత రెండు రోజులుగా కల్తీ మద్యం తాగడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 1990 నుంచి నాగాలాండ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉన్న.. ఈ స్థాయిలో అక్రమ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.
ఏ జిల్లాల్లో ఎంత మంది
అక్రమ, కల్తీ మద్యం తాగడం వల్ల రాష్ట్రంలోని రెండు జిల్లాలు టుయెన్‌సాంగ్ జిల్లాలో 11 మంది, మోకోక్‌చుంగ్ జిల్లాలో 8 మంది మరణించారు.
రంగంలోకి దిగిన సిట్ (SIT)
ఈ ఘోర ఉదంతంపై విచారణ జరిపేందుకు ఇంకా ఈ కల్తీ మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతోందో (Supply Chain) కనిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐ బుంగ్లాంగ్ చాంగ్ నేతృత్వంలో ఈ సిట్ బృందం పనిచేస్తుందని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ వెసుప్రా కెజో వెల్లడించారు.
మరణాలకు అసలు కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికి పోలీసులు సంఘటనా స్థలం నుంచి లభించిన శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల కోసం పంపారు.
అయితే విచారణలో కీలక ఆధారాలు లభించాయని, అయితే దర్యాప్తు పురోగతిలో ఉన్నందున పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని సీనియర్ ఎస్పీ తెలిపారు.
భారీగా దాడులు - 19 మంది అరెస్ట్
ఈ మరణాల వార్త వెలుగుచూడటంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పలు అక్రమ మద్యం స్థావరాలపై దాడులు నిర్వహించారు. దింతో కల్తీ మద్యం విక్రయాలు, సరఫరాతో సంబంధం ఉన్న 19 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 3 వేల అక్రమ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల హెచ్చరిక
ఎలాంటి లేబుల్ లేని, అనుమానాస్పద లేదా అక్రమంగా విక్రయించే మద్యాన్ని అస్సలు తాగొద్దని పోలీసులు ప్రజలను గట్టిగా హెచ్చరించారు. ఒకవేళ మద్యం తాగిన తర్వాత కళ్లు తిరగడం, దృష్టి మసకబారడం (చూపు సరిగ్గా ఆనకపోవడం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
