పాకిస్తాన్ లో లాక్ డౌన్.. ఎక్కడికక్కడ బారికేడ్లు.. సైన్యం మోహరింపు

పాకిస్తాన్ లో లాక్ డౌన్.. ఎక్కడికక్కడ బారికేడ్లు.. సైన్యం మోహరింపు

పాకిస్తాన్ దేశం కల్లోలంగా మారింది. ఎక్కడికక్కడ జనాన్ని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. పాకిస్తాన్ దేశం రాజధాని సిటీతోపాటు ప్రధానమైన నగరాల్లో లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. జనం ఎవరూ బయటకు రావొద్దు.. గుంపులుగా తిరగొద్దు.. మీటింగ్స్ పెట్టొద్దు అంటూ ఆంక్షలు విధించింది. భద్రత కోసం సాధారణ పోలీసులు సరిపోకపోవటంతో సైన్యాన్ని రంగంలోకి దిగింది పాకిస్తాన్ సర్కార్. ఇంతకీ పాకిస్తాన్ లో ఇప్పుడు లాక్ డౌన్ ఏంటీ.. కరోనా మళ్లీ వచ్చిందా అక్కడ అనే డౌట్ రావొచ్చు.. కారణం కరోనా కాదు.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు అనుమతి ఇస్తే అది దేశ వ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందనే భయంతో పాకిస్తాన్ సర్కార్ ఏకంగా లాక్ డౌన్ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పీటీఐ పార్టీ నేతలు పిలుపునిచ్చిన మార్చ్ ను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రోడ్లకు అడ్డంగా వెయ్యికి పైగా షిప్పింగ్ కంటైనర్లు ఉంచారు. వెంతెనలపై ఇసుక బస్తాలు వేశారు. రాజధాని నగరానికి వెళ్లే ప్రధాన రహదారిని మూసేసారు. ఇస్లామాబాద్ లో బహిరంగ సమావేశాలపై నిషేధం విధించారు.

ఇస్లామాబాద్ వ్యాప్తంగా 22 వేల మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. ఖైబర్ పఖూన్జఖ్వాలో భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు, పెషావర్ ను ఇస్లామాబాద్ లో కలిపే ప్రధాన రహదారిని మూసివేశారు. అయితే..ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

పలు కేసుల్లో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పీటీఐ శ్రేణులు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబసభ్యులు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆదివారం ( సెప్టెంబర్ 27 ) పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమానికి అక్టోబర్ 4వ తేదికి వాయిదా వేసింది పీటీఐ.