గుంటూరు: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో విజయవాడ ట్రాఫిక్ DCP కూతురు చనిపోయింది. విజయవాడ నుంచి చీరాల బీచ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గుంటూరు ఏటుకూరు బైపాస్ దగ్గర లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ DCP షిరీన్ బేగం కూతురు షేక్ అసిఫా ప్రాణాలు కోల్పోయింది. అసిఫా వయసు 24 సంవత్సరాలు. ఆదివారం కావడంతో ఫ్రెండ్స్ తో కలిసి విజయవాడ నుంచి కారులో చీరాల బీచ్కు వెళ్లేందుకు బయల్దేరారు.
విజయవాడ నుంచి చీరాల బీచ్‌కు వెళ్లే మార్గంలో గుంటూరు ఏటుకూరు బైపాస్ దగ్గర లారీ వీరి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అసిఫాతో పాటు కారులో ఉన్న మరో నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలా.. విహార యాత్ర కాస్తా విషాదాంతంగా ముగిసింది.
కూతురు చనిపోయిన విషయం కాల్ ద్వారా తెలుసుకున్న విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షాక్కు లోనయ్యారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన గుంటూరుకు వెళ్లారు. నవ్వుతూ సరదాగా ఇంటి నుంచి వెళ్లిన కూతురుని విగత జీవిగా చూసి ఆమె నిర్ఘాంతపోయారు. గుండెలవిసేలా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
