ఒకప్పుడు ప్రజాప్రతినిధులు సాధారణ జీవితం గడిపేవారు. దివంగత పీవీ నర్సింహారావు లాంటి మహా నాయకులు తమ ఆస్తిపాస్తులను పేదలకు పంచి, పాత భవంతుల్లోనే కాలం వెళ్లదీశారు. పెంకుటింట్లో నివసిస్తూ బస్సులో తిరిగే గుమ్మడి నర్సయ్య లాంటి ఎమ్మెల్యేలనూ చూశాం. కానీ ప్రస్తుత నేతలు ఇలా ఎమ్మెల్యే కాగానే అలా కోట్లు కూడబెట్టి, భారీ భవంతుల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. ఇన్నాళ్లూ వీరి వ్యక్తిగత జీవితం నాలుగు గోడల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు వ్యూస్ కోసం, ఫ్యాన్స్ కోసం యూట్యూబ్ చానళ్లను లోపలికి రానిచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వీడియో రాగానే నెటిజన్లు ‘స్క్రీన్ షాట్లు’ తీస్తున్నారు. ఒకప్పుడంటే నేతలను ప్రశ్నించడం సాధ్యం కాకపోయేది. ఇప్పుడు డిజిటల్ యుగం.. నేతలను జనం ఓ ఆట ఆడుకుంటున్నారు.
హోమ్ టూర్లలో బయటపడిన వాళ్ల ఆస్తుల లెక్కలను సోషల్ మీడియాలోనే తేల్చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఏ బ్రాండ్? దాని ఖరీదు ఎంత? గచ్చుకు వేసిన మార్బుల్ ఏ దేశం నుంచి వచ్చింది? అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్లో వేసి వెతికేస్తున్నారు. ఈసీఐలో పెట్టిన అఫిడవిట్ డౌన్లోడ్ చేసి.. వాళ్ల ఇండ్లలోని ఆస్తులను చూపించారా? అంటూ కామెంట్ బాక్సుల్లో నిలదీస్తున్నారు.
‘మేం ప్రజాసేవ కోసం వచ్చాం.. ప్రజల కోసమే బతుకుతున్నాం’ అని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే నాయకులు, తెరవెనుక రాజుల కాలం నాటి జమీందారుల్లా బతుకుతున్నారనే చేదు నిజాన్ని ఈ ‘హోమ్ టూర్లు’ బట్టబయలు చేశాయని నెటిజన్లు చెప్తున్నారు. సామాన్యులు గుంట జాగ కొనలేక, ఇల్లు కొంటే ఈఎంఐలు కట్టలేక సతమతమవుతుంటే ప్రజాసేవకుల ముసుగులో ఈ రాచరికపు వైభోగాలేంటి?’’ అని ప్రశ్నిస్తున్నారు.
