నిమజ్జనం ప్రశాంతం.. ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత

నిమజ్జనం ప్రశాంతం.. ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత

రెండు రోజుల మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. 2026 సెప్టెంబర్ 26న ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాల కార్యక్రమం పరిశీలించిన సీపీ.. మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతం ముగిశాయని ఈ సందర్భంగా చెప్పారు.

ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం పూర్తి కావడంతో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేసినట్లు చెప్పారు. క్రేన్లు తదితర నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన వాహనాలు, సమాగ్రిని కూడా తొలగించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనాలు  ముగిశాయని అన్నారు. ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టి కృషితోనే ఇంత పెద్ద టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. 

అక్కడక్కడ కొన్ని లోపాలు, ఘటనలు జరిగినట్లు సీపీ తెలిపారు. గత రెండు రోజులుగా పోలీసులు నిద్ర కూడా లేకుండా నిమజ్జనాలలో పాల్గొన్నారని తెలిపారు. పోలీసులు విధులకు వచ్చిన తర్వాత వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని భవిష్యత్తులో మరింత మెరుగైన పోలీసింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించనున్నట్లు తెలిపారు. 

బందోబస్తుకు సిటీ బయటనుంచి, జిల్లాల నుంచి పోలీసులు వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ శోభాయత్ర జరిగిందన్నారు. నిమజ్జనం సక్సెస్ చేసినందుకు హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

వచ్చే ఏడాది నుంచి కలర్ పేపర్లు బ్యాన్ :

నిమజ్జనం సందర్భంగా సిటీ వ్యాప్తంగా కలర్ పేపర్లు వాడటం వలన చాలా ఇబ్బందిగా మారిందన్నారు. దీని వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయని.. కొన్ని వాహనాలు స్కిడ్ అయ్యి పడే పరిస్థితి వచ్చిందన్నారు. జీహెచ్ఎంసీతో మాట్లాడి బ్యాన్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధొంగా అన్నదానంలో ఉపయోగించిన ప్లేట్లు, గ్లాసులు  ఎక్కడపడితే అక్కడ పడేయటం బాధించిందని అన్నారు. ఇక వాహనాల ఓవర్ స్పీడ్ కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు. కొందరు శోభాయాత్రకు కొందరు తాగి వచ్చారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఖైరతాబాద్ కు 30 లక్షలు, బాలాపూర్ కు 15 లక్షల మంది భక్తులు:

గణేష్ విగ్రహాల దర్శనానికి చాలామంది భక్తులు వచ్చినట్లు చెప్పారు సీపీ సజ్జనార్.ఈ సారి పబ్లిక్ ఎక్కువ అయినట్లు తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహాన్ని 30 లక్షలకు పైగా భక్తులు  దర్శించుకున్నట్లు చెప్పారు. అదే విధంగా  బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఈ సారి15 లక్షల మంది వచ్చినట్లు సీపీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శోభాయత్ర, నిమజ్జనం పూర్తి చేసినట్లు తెలిపారు. సమిష్టి కృషితోనే నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.