కొద్దిగా డబ్బులు ఉన్నాయి. ఎక్కడో దూరంగా స్థలాలు అమ్ముతున్నారన్నా.. పాత ఇళ్లు అమ్ముతున్నారన్న ఉన్న బడ్జెట్ ప్రకారం.. కొద్దిగా అప్పు చేసైనా సరే తీసుకొనేందుకు చాలా మంది వెళుతుంటారు. తీరా కొన్న తరువాత.. అనుకోని సమస్యలు వస్తే వాస్తు ప్రకారం ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తారు.. అందుకే స్థలం కొనేటప్పుడు.. పాత ఇంటిని కొని రీమోడల్ చేసేటప్పుడు వాస్తు సిద్దాంతం ప్రకారం కొన్నింటికి కచ్చితంగా సరిచూసుకోవాలి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
వాస్తు శాస్త్రంలో స్థలాల శుభాశుభములు కనుక్కోవడం చాలా అవసరం. కొత్త గృహాన్ని నిర్మించుకోవాలన్నా.. పాత గృహన్ని సరిదిద్దుకోవాలన్న కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
తూర్పు వీధి గల స్థలం : ఏ స్థలానికైతే తూర్పు వైపున వీధి ఉంటుందో ఆ ఇంటి యాజమానిపైనా ఆ ఇంటగల మగసంతతి పైనా ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
1. తూర్పు ఈశాన్యంలో వీధి
- తూర్పు ఉత్తరాలలో దక్షిణ, పశ్చిమాల కన్నా రెట్టింపు ఖాళీస్థలం
- ఇంటికి మరియు ఇంటి ఆవరణలో ఈశాన్యం నుంచి నడవడం లేదా ద్వారాలు వుండటం
- దక్షిణ, పశ్చిమ భాగాలు ఎక్కువ ఎత్తులో ఉండటం..
- తూర్పు, ఉత్తరం భాగాలు పల్లంగా వుండటం...
- ఈశాన్యంలో నుయ్యి
పైన తెలిపిన విధంగా గృహ నిర్మాణం ఉంటే ఆ ఇంటిలో ఉంటే మగ సంతతి చాలా గొప్పస్థితిని పొందుతారు. స్థిర, చరాస్తులు కల్గి, సంఘంలో గౌరవ, మర్యాదలు కల్గిన వారై యుందురు.
2. తూర్పుభాగాము ఎత్తుగానూ.. పశ్చిమం పల్లంగా వున్నచో ఆ ఇంటి యజమాని ఆరోగ్యంలో ఇబ్బందులు.. ఆ ఇంట్లో మహిళలే ఆధిపత్యము వహిస్తారు. ఇలాంటి ఇంట్లో నివసించే వారికి పురుష సంతతి లేకపోవటం గాని, వున్నా దరిద్రులుగానో, అమాయకులుగానో, దుర్వ్యసనపరులుగానో వుండి వృద్ధి లేనివారై యుందురు. అవమానాలు, అప్పుల బాధలు తప్పవు. కేవలం ఇల్లే కాదు.. ఇంటి స్థలంలో ఇలా ఉన్నా ఇలాంటి ఫలితములే ఉండును. అలాంటప్పుడు కచ్చితంగా ఎత్తు పల్లాల విషయంలో మట్టి పోయించుకొని సరిచేసుకొనవలెను.
3. తూర్పు ఈశాన్యం తగ్గడం.. ఆగ్నేయం పెరగడం..ఇలాంటి స్థలం ఉన్న ఇంటిలో నివసించి వారికి మగ సంతతి పుట్టరు. పుట్టినా 10 సంవత్సరాలలోపు మరణించడమో, ప్రమాదాల్లో అంగవైకల్యము కలగటమో జరుగును. మతిలేనివారు, అమాయకులు ఇటువంటి గృహములో నుందురు. గృహయజమాని.. మొదటి కుమారుడి ఆరోగ్యం బాగా లేదనో, మరణించినాడనో, దుర్వాసనపరుడనో విచారించాల్సి వుండును.
4. ఈశాన్యంలో మేడ మెట్లు వుండడం.. ఈశాన్యం మూల బరువుల ఉండటం..వలన యజమాని అనారోగ్యంతో గాని ప్రమాదాల్లో గాని ప్రాణాలు కోల్పోతారు. ఇంకా ఆ ఇంట్లో ఉండే మొదటి కుమారుడు ప్రయోజనం లేనివాడై ఉండును. దీనికి తోడు నైరుతిదోషాలు వుంటే ప్రథమ సంతతి దుర్మరణము పొందుదురు..
5. ఈశాన్యంలో వాటర్ సంప్ , నుయ్యి, బోరింగ్, కుళాయి గుంటలు వున్న శుభఫలితాలు పొందుతారు.
6. ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉండిన ఎడల వంశము నశించును. వికారమైన, అమాయకపు పిల్లలు పుట్టడం జరుగుతుంది. కుటుంబ కలహలు వస్తాయి. ఇందుగల సంతతి చెడు ప్రవర్తన కలిగి యుందురు. ఇటువంటి గృహలలో కులాంతర వివాహలు కూడా జరుగును. సాంప్రదాయలకు తిలోదకాలు ఇచ్చి నాస్తికజీవనం గడుపుతారు.
7. ఈశాన్యం ఎత్తుగా వుండటం...ఈశాన్యం మూతపడటం ... సంభవిస్తే ఆ ఇంటికి దత్తు రావటమో, ఇల్లరికపు అల్లుళ్ళను తెచ్చుకోవటమో జరుగుతుంది.
8. ఈశాన్యంలో వంటగది వలన ఖర్చు అధికమగును. ఈ గృహములో లక్షలు సంపాందించినా పది రూపాయలకు వెతకవలసి వుండును. ఈశాన్యపు వంటగది వలన ఐశ్వర్యవంతులు కూడా ఆర్థిక పతనము చెందుదురు. స్థిర చరాస్తులు అమ్ముకొందురు. భార్యభర్తలు పోట్లాడుకొంటూ అన్యోన్యత లేని జీవితము గడుపుదురు. ఈశాన్యం పొయ్యిగల గృహములో కొన్నింటిలో వంశము వుండదు.
9. ఈశాన్యం గది అన్ని గదులున్నా పల్లంగా వుండవలెను. ఈశాన్యపు గదికి ప్రవేశద్వారము, నిష్ర్కమణ ద్వారము అని రెండు ద్వారాలు వుండాలి. ఈశాన్యం గదిలో మూడు ద్వారాలు ఉండిన యజమానికి గుండె సంబంధ రోగాలు వచ్చును.
10. ఇంటి ఆవరణకు, గృహనికి ఈశాన్యం తగ్గినచో పిల్లలు పుట్టరు. యుక్తవయస్సు వచ్చిన సంతతి మరణించడం జరుగుతుంది.
11. గృహనికి తూర్పు ఇంటి ప్లోరింగ్ లెవెల్ కన్నా ఎత్తుగా అరుగులున్నాచో అప్పుల బాధ ఎక్కువగా యుండును. ఆడ పెత్తనం జరగటం, అవమానాలు కలుగుతాయి.
12. గృహనికి తూర్పు వైపులో ఖాళీ స్థలం తక్కువగా వుండటం.. పశ్చిమాన ఖాళీ స్థలం ఎక్కువగా వున్నచో అందు మగ సంతతి లేకపోవటం ... ఆడ సంతతి ఎక్కువగా వుండటం జరుగుతుంది.
13. ఈశాన్యంలో ఇనుప సామాను, రాళ్ళకుప్పలు, పెంటపోగులు వేయకూడదు. ఇలా వేయడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాకుండా బ్రతుకు భారమైపోతుంది.
14. తూర్పు గృహనికి ఈశాన్యభాగములోని ద్వారము సర్వశుభాలను చేకూరుస్తుంది.
15. తూర్పు ఆగ్నేయంలో ద్వారము వున్నా ఆ ఇంట రెండవ కుమారుడి గురించి విచారించాల్సి వస్తుంది.
తూర్పు ఆగ్నేయపు నడక ఆ ఇంటి యజమానురాలి పైనా, రెండవ కుమారుడి పైనా చెడు ప్రభావం చూపడమే కాకుండా, చోర భయము, అగ్నిభయం కల్గిస్తుంది. కోర్టు వ్యాజ్యాలు, జైలుశిక్షలు అనుభవించాల్సి వుంటుంది.
16. తూర్పు భాగం పల్లంగా వున్నచో వంశాభివృద్థి కలిగి, తరగని సిరులు గలవారై యుందురు.
17. తూర్పు ప్రహరీ గోడ పశ్చిమం ప్రహరీ గోడ కన్నా ఎత్తు తక్కువగా వుంటూ, రోడ్డుపై నడుచు వారికి వీధి గుమ్మము కనిపించినట్లు నిర్మించుకొనుట సర్వశ్రేష్ఠము. తూర్పు సింహద్వారము- దక్షిణం, పశ్చిమం వైపు సింహద్వారాల కన్నా ఎంతో కొంత చిన్నదిగా వుండవలెను.
18. తూర్పు భాగం పల్లంగా ఉండి, విశాలంగా వున్న కీర్తి , పేరు ప్రతిష్ఠలు, డబ్బు, ఉత్తమ సంతానం కలిగి యుందురు
19. తూర్పు వాలువసారా (వరండా) వలన పురుషులు సత్ఫలితాలను పొందుదురు. డబుల్ వసారా (వరండా) వలన పురుషులు మరింత ఉత్తమ ఫలితాలు పొందుదురు.
20. గృహము పశ్చిమ భాగం ఎత్తుగాను, తూర్పు భాగం పల్లంగాను వుండటము వలన పుత్రసంతతి వృద్ధి పొంది, ఐశ్వర్యవంతులై యుందురు.
21. తూర్పుదిశలో ఖాళీ స్థలం లేకుండా బోర్డర్‌కు హద్దుచేసిన గృహములో నివసించు వారి వంశము లేకపోవటమో, నేత్రవ్యాధులు కలగటం, గుడ్డితనం కలగటమే కాకుండా ... ఇంటి యందు స్ర్తీలే మగవారివలె పెత్తనం చెలాయించుదురు. ఆ ఇంట ఆడపిల్లలు వృద్ధి నొంది, మగపిల్లలు భ్రష్టులగుదురు. దానికి నైరుతి దోషాలు తోడైతే ఆడపిల్లలు కూడా ప్రవర్తనాదోషులై యుందురు.
22. తూర్పు ఆగ్నేయంలో గుంటలు, నుయ్యి వున్నచో సంతతి లేకపోవటము, ఇద్దరు భార్యలుండటము జరుగును. ఆ ఇంట దొంగతనం, అగ్నిప్రమాదాలు జరుగును. కోర్టు వ్యవహరాలు, జైలుశిక్షలు అనుభవించడం జరుగును. భార్యభర్తలకు అన్యోన్యత లేకపోవటం, యజమానురాలు, ఆడసంతతి అనారోగ్యవంతులుగా ఉందురు.
23. ఆగ్నేయము క్లోజ్ అయినచో ఆ ఇంట ఆడసంతతి పెళ్లి అయిన తరువాత ఏదో ఒక కారణం వలన పుట్టింటికి చేరుకొందురు.
24. ఈశాన్యపు వీధిపోటు వున్నచో గొప్ప ఐశ్వర్యవంతులై, అధికారవంతులై ముందురు.
25 . గృహములో వాడిన నీరు ఈశాన్యం గుండా బయటకు వెళ్ళిన గొప్ప శుభఫలితాలను ఇచ్చును. ఆగ్నేయం గుండా బయటకు వెళ్ళిన కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది.
26 . ఇంటి స్ధలం.. ఇల్లు కన్నా రోడ్డు ఎత్తులో ఉండకూడదు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
