మంచు దేశంలో మండుటెండలు: ఏసీల కోసం షాపులపై పడి కొట్టుకున్న ఫ్రాన్స్ ప్రజలు

మంచు దేశంలో మండుటెండలు: ఏసీల కోసం షాపులపై పడి కొట్టుకున్న ఫ్రాన్స్ ప్రజలు

ఊహించని రీతిలో యూరప్ ఖండం నిప్పుల కొలిమిలా మారిపోయింది. మంచు ముక్కల్లాంటి మేఘాలు, చల్లని గాలులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఫ్రాన్స్ దేశం ఇప్పుడు ఎండల దెబ్బకు విలవిలలాడుతోంది. అక్కడ సూర్యుడు పగబట్టినట్లుగా మండిపోతుంటే.. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు. ఫ్రాన్స్‌లోని చాంబెరీ నగరంలో ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్ తలుపులు తెరిచీ తెరవగానే.. వందలాది మంది కస్టమర్లు పిడుగుల్లా దూసుకొచ్చారు. ఆఫీస్ ఫైల్స్ కోసం కాదు, ఐఫోన్ల కోసం అంతకన్నా కాదు.. ఏసీలు, కూలర్లు కొనుక్కోవటం కోసం. షాపులోని ఐల్స్‌ గుండా జనం ఒకరినొకరు నెట్టుకుంటూ, ఉరుకులు పరుగులు పెడుతూ కూలింగ్ అప్లయెన్సెస్ వైపు దూసుకెళ్లిన విజువల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఫ్రాన్స్ లాంటి ప్రశాంత దేశంలో ఏసీల కోసం ఇలాంటి తోపులాటలు జరగడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఈ ఏడాది యూరప్‌ను అతలాకుతలం చేస్తున్న అత్యంత భయంకరమైన హీట్‌వేవ్ సంక్షోభంలో ఫ్రాన్స్ ఘోరంగా దెబ్బతింది. వాతావరణ రికార్డులను తిరగరాస్తూ ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజధాని పారిస్ నగరంలో ఈ ఒక్క వారంలోనే 40 డిగ్రీల సెల్సియస్ దాటిన రోజుల సంఖ్య.. 1872 నుండి 2019 వరకు అంటే దాదాపు 150 ఏళ్లలో నమోదైన మొత్తం రోజుల కంటే ఎక్కువ కావడం గమనార్హం. దీన్ని బట్టే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

'హీట్ డోమ్' అనే వాతావరణ మార్పుల కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు ఈ రేంజ్‌లో పెరుగుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక భారీ హై ప్రెజర్ ఏరియా వేడి గాలిని కదలకుండా ఒకే చోట బంధించేయడంతో.. ఆకాశం మేఘాలు లేకుండా క్లియర్‌గా మారి సూర్యుడు సెగలు కక్కుతున్నాడట. దీనివల్ల సుదీర్ఘ కాలం పాటు వేడి వాతావరణం అలాగే ఉండిపోతోందని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ : రెయిన్‌బో జెండాలపై వివాదం..

ఈ వారంలో ఫ్రాన్స్ దేశవ్యాప్త సగటు ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 29.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. పగలు, రాత్రి రీడింగులను కలిపి చూస్తే గతంలో ఎన్నడూ లేనంతగా హీట్ రికార్డులు బద్దలయ్యాయి. కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాదు.. ఇటలీ, స్పెయిన్ వంటి పొరుగు దేశాలు కూడా ఈ మండుటెండల ధాటికి అల్లాడిపోతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సుదీర్ఘమైన, విపరీతమైన ఎండలను ఊహించని యూరోపియన్ దేశాలు.. ఇప్పుడు ఏసీలు, కూలర్లు లేకపోతే బతకలేమనే పరిస్థితికి వచ్చేశాయి.