FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) వేదికగా ఒక కొత్త వివాదం చెలరేగింది. గ్రూప్-Gలో భాగంగా ఇరాన్ వర్సెస్ ఈజిప్ట్ మధ్య జరగబోయే మ్యాచ్‌లోకి అభిమానులు ఎల్‌జీబీటీక్యూ+ (LGBTQ+) కి మద్దతుగా రెయిన్‌బో ఫ్లాగ్స్ తీసుకురావడానికి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జెండాలను, సింబల్స్‌ను స్టేడియంలోకి అనుమతించవద్దని ఇరాన్, ఈజిప్ట్ దేశాలు ఫిఫాను గట్టిగా కోరినప్పటికీ.. వాటి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఫిఫా ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ప్రైడ్ మ్యాచ్ వివాదం:
జూన్ 26న సీయాటిల్‌లోని లుమెన్ ఫీల్డ్ (Lumen Field) మైదానంలో ఇరాన్ వర్సెస్ ఈజిప్ట్ జట్ల మధ్య ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. సరిగ్గా ఇదే సమయంలో సీయాటిల్‌లో ప్రైడ్ వీక్ (Seattle Pride Week) నడుస్తుండటంతో.. ఈ మ్యాచ్‌ను అధికారికంగా ప్రైడ్ మ్యాచ్ (Pride Match) గా ప్రకటించారు. అందరినీ కలుపుకుపోవాలనే ఫిఫా సమగ్రత (Inclusivity) పాలసీలకు.. ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, ఈజిప్ట్ సంప్రదాయ నమ్మకాలకు మధ్య ఇక్కడ గట్టి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ రెండు దేశాల ఫుట్‌బాల్ ఫెడరేషన్లు ప్రైడ్ మ్యాచ్ గుర్తింపుపై అధికారికంగా ఫిఫాకు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.
LGBTQ+ చిహ్నాలను వ్యతిరేకిస్తున్న ఇరాన్, ఈజిప్ట్:
* ఈజిప్ట్ రిజెక్షన్: స్టేడియం లోపల హోమోసెక్సువాలిటీకి మద్దతు ఇచ్చే ఎలాంటి యాక్టివిటీస్‌నైనా తాము పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ఈజిప్షియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ గత డిసెంబర్‌లోనే ఫిఫాకు లేఖ రాసింది.
* ఇరాన్ హెచ్చరిక: ది అథ్లెటిక్ సంస్థకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్పందిస్తూ.. ఇరాన్, ఈజిప్ట్ రెండూ ముస్లిం దేశాలు.. మా ప్రజల సాంస్కృతిక, మతపరమైన నమ్మకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం.. స్టేడియం లోపల గానీ, మ్యాచ్ జరిగే పరిసరాల్లో గానీ ఈ మూవ్‌మెంట్‌కు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ జరగకూడదని స్పష్టం చేస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిఫాను కోరింది.
తగ్గేదేలే అంటున్న ఫిఫా:
ఈ వివాదం కారణంగా ఆయా దేశాలలో ఎల్‌జీబీటీక్యూ+ ప్రజల పట్ల ఉన్న కఠిన చట్టాలపై అంతర్జాతీయంగా మళ్లీ చర్చ మొదలైంది. ఇరాన్‌లో స్వలింగ సంపర్కానికి ఏకంగా మరణశిక్ష విధించే అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇక ఈజిప్ట్‌లో దీనిపై ప్రత్యేకంగా చట్టాలు లేకపోయినప్పటికీ.. అసభ్యత (Debauchery) చట్టాల కింద ఇట్లాంటి వారిని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఈ ఆరోపణలు, దేశాల అభ్యంతరాలు ఎలా ఉన్నప్పటికీ.. ఫిఫా మాత్రం తన రూల్స్‌కు కట్టుబడి స్టేడియం లోపలికి రెయిన్‌బో ఫ్లాగ్స్‌ను అనుమతించి తీరుతామని తేల్చి చెప్పింది. దీంతో ఈ వరల్డ్ కప్ టోర్నీలోనే మైదానం వెలుపల అత్యంత వివాదాస్పదమైన మ్యాచ్‌గా ఇది నిలిచింది.
Egypt and Iran filed an objection with FIFA to prevent LGTBQ flags at its World Cup match due to Islamic religious values.
— World Cup HQ (@WorldCup26HQ) June 26, 2026
Seattle refused and officially designated the 🇪🇬 Egypt-Iran 🇮🇷 game a "Pride Match." 🏳️🌈 pic.twitter.com/S1F7FJzo8V
