ఆంధ్రా తీరంలోని బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ఐఎండీతో పాటు గ్లోబల్ ఫోర్ క్యాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మిడ్ రేంజ్ ఫోర్ క్యాస్ట్ వెల్లడించాయి.
జులై 5వ తేదీ నాటికి అల్పపీడనం మరింత బలపడి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే ముప్పు కూడా పొంచి ఉందని తెలిసింది. ఈ అల్పపీడనం ఏ ప్రాంతం మీదుగా పయనిస్తుంది, దీని తీవ్రత ఏ మేరకు ఉంటుంది, ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారేందుకు 30 శాతం మాత్రమే అవకాశం ఉంది. దీని వల్ల కురిసే వర్షాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సాగు పనులకు ఎంతగానో మేలు చేకూరుస్తాయనే అంచనాలు ఉన్నాయి.
జూన్లో వర్షపాత లేమితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మెట్ట పంటల రైతులకు జూలై మొదటి వారంలో కురిసే ఈ వర్షాలు కొత్త ఆశలు చిగురింపజేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ వర్షపాతం భూగర్భ జలాల పెరగడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
