మహాభారతం ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణ రాయబారం అయిన తరువాత పరశురాముడు దుర్యోధనుడికి హితబోధ చేశాడు. చాలారోజుల క్రితం దంభోద్భవుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఈ మొత్తం భూమండలాన్ని పాలించేవాడు. అతడు మహాయోధుడు. ఆ రాజు రోజూ ఉదయం కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకొని, రత్న కిరీటం ధరించి, కరవాలం తీసుకుని, సభా భవనానికి వచ్చి బంగారు సింహాసనం మీద కూర్చునేవాడు.
వందిమాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తుంటే, గర్వంగా ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ – ‘ఈ భూలోకంలో నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. వాడిని క్షణంలో కడతేరుస్తాను’ అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరేసేవాడు. ఆయన బలపరాక్రమాలు తెలిసినవారెవరూ యుద్ధానికి దిగేవారు కారు. అందువల్ల ఆయన అహంకారం పెరిగి పెరిగి, ‘నా అంతవారు లేడు’ అనే గర్వంతో విర్రవీగుతున్నాడు.
అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా! వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి దూరదేశీయులైన విప్రులు వచ్చారు. వారు ‘మహారాజా! మీరు నిజంగా మహావీరులే అయితే – గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము.
తమకు కోరిక వుంటే వారితో యుద్ధం చేయవచ్చు’ అన్నారు. ‘నన్ను మించిన యోధులా వారు’ అంటూ సేనలను సన్నద్ధం చేసి ధనుర్భాణాలు తీసుకుని గంధమాదన పర్వతం చేరాడు. ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచాడు. తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరపబోగా ‘ఇవన్నీ అనవసరం – యుద్ధం.. యుద్ధం..’ అని అట్టహాసం చేశాడు.
అప్పుడు వారు ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులమైన మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది’ అన్నాడు. వాడు మాట వినకుండా బాణం తొడుగుతుంటే చూసిన నరుడు నవ్వుతూ ఒక దర్భ పుల్ల తీసి –‘ఈ గడ్డిపరక నీ సేనను నిలబెడుతుంది’ అని వదిలాడు. ఆ రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలుముక్కలు చేసింది.
రాజుకి తల తిరిగిపోయింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. అంతే.. రాజు తన ఆయుధాలన్నీ క్రింద పెట్టి, నరనారాయణుల పాదాల మీద వ్రాలి... ‘ఆర్యా! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది’ అని దీనంగా ప్రార్థించాడు.
అప్పుడు వారు నవ్వుతూ – ‘మహారాజా! సిరిసంపదలు కలవారు పేదసాదలకు దానధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారినుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. ఇరుగుపొరుగులకు ఉపకారం చేయనివాడి జన్మ వ్యర్థం’ అన్నారు.
►ALSO READ | Shriyam Bhagnani: ఖాళీ గ్యాస్ సిలిండర్లతో శిక్షణ.. ఒక్క పాత్ర కోసం 9 నెలలు.. నటి శ్రియం సక్సెస్ స్టోరీ
మహారాజు వారి బోధనలు విని ఆనాటి నుంచీ అహంకారం విడిచాడు. అందరి శ్రేయస్సూ దృష్టిలో ఉంచుకున్నాడు. సంపదలను బీదలకు దానం చేయసాగాడు. తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించాడు. న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.
‘కనుక దుర్యోధనా అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి’ అన్నాడు పరశురాముడు. సాక్షాత్తు పరశురాముడంతటి వాడు ఇన్ని మంచి విషయాలను ఉదాహరణలతో బోధించినప్పటికీ దుర్యోధనుడిలో ఎటువంటి మార్పు రాలేదు. తన చుట్టూ ఉన్న కర్ణుని వంటి వారి పొగడ్తలతో మరింత అహంకారాన్ని పెంచుకున్నాడు. తన బలాన్ని, శక్తిని అన్యాయ మార్గం కోసం ఉపయోగించాడు. కనుకనే కురుక్షేత్ర యుద్ధంలో ఓటమిపాలయ్యాడు.
కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు వంటి ఎందరో యోధాగ్రేసరులతో పాటు పదకొండు అక్షౌహిణిల సేన దుర్యోధనుని పక్షాన ఉంది. అయినప్పటికీ వారు ఓడిపోయారు. అన్యాయంగా, అధర్మంగా సజ్జనులైన పాండవుల మీద యుద్ధం చేయడమే ఇందుకు కారణం. అహంకారంతో ఉండేవారిలో విచక్షణ ఉండదు. బుద్ధిబలం ఉండదు. ఆవేశమే కాని ఆలోచన ఉండదు. ఆ కారణంగానే వారు ఓటమిపాలవుతారని మహాభారతం చెప్తోంది.
(ఉషశ్రీ రచించిన ‘భారతంలో నీతి కథలు’ పుస్తకం ఆధారంగా)
- డా. పురాణపండ వైజయంతి
