Terrorists at Shoaib Akhtar brothers funeral: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మెడకు ఒక వివాదం చుట్టుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (LeT)తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు.. ఇస్లామాబాద్‌లో జరిగిన అక్తర్ పెద్దన్న షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు హాజరుకావడమే ఇందుకు కారణం.
అన్న మరణంతో విషాదంలో అక్తర్..
షోయబ్ అక్తర్ బిగ్ బ్రదర్ షాహిద్ అక్తర్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఈ వారం ప్రారంభంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్తర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, మాజీ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. అన్నను కోల్పోయిన బాధలో ఉన్న అక్తర్ కూడా అక్కడే ఉన్నారు.
వివాదానికి కారణం ఇదే:
అంత్యక్రియలు ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఆ విజువల్స్ లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా, పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇనామ్-ఉర్-రెహమాన్ కంబోహ్ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఈ PMML పార్టీకి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (LeT) తో సంబంధాలు ఉన్నాయని గతంలో మీడియా నివేదికలు పేర్కొన్నాయి. దీంతో అక్తర్ అన్న అంత్యక్రియలకు ఉగ్రవాద లింకులున్న వ్యక్తులు రావడంపై నెట్టింట పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది.
నెటిజన్ల భిన్న స్పందనలు!
షోయబ్ అక్తర్ స్వయంగా ఆ వ్యక్తులను పిలిచాడనడానికి గానీ, లేదా అతనికి లష్కరే తొయిబాతో ఎలాంటి సంస్థాగత సంబంధాలు ఉన్నాయనడానికి గానీ ఎలాంటి ఆధారాలు లేవు.. ఈ వివాదంపై షోయబ్ అక్తర్ గానీ, అతని ప్రతినిధులు గానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అక్తర్ దీనిపై క్లారిటీ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం అతడికి సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్థాన్‌లో అంత్యక్రియలు బహిరంగంగా జరుగుతాయని, అక్కడికి ఎవరైనా రావచ్చని, అంతటి దుఃఖంలో ఉన్న కుటుంబం ఎవరు వస్తున్నారో నియంత్రించడం సాధ్యం కాదన్నారు.
Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026
Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.
PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl
