నార్త్ ఇండియా ఫేమస్ వంటకం పరాటా.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఫేమస్ అయిందనుకోండి. పరాటా అనగానే ఆలూ పరాటా గుర్తొస్తుంది చాలామందికి. ఈసారి ఆలూతో కాకుండా ఇంకాస్త వెరైటీగా చేసుకుని తింటే యమ్మీయమ్మీగా ఉంటుంది. వేడివేడి పరాటాలను స్పైసీ కూరలతో కలిపి తింటుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. వెరైటీ టేస్టీ పరాటాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. .
మిక్స్డ్ వెజిటబుల్ పరాటా తయారీకి కావాల్సినవి
- గోధుమపిండి- రెండున్నర కప్పులు
- పన్నీర్ తరుగు- వంద గ్రాములు
- ఉప్పు- తగినంత
- నూనె - సరిపడా
- క్యారెట్ తరుగు- పావు కప్పు
- బీన్స్ తరుగు- పావు కప్పు
- ఉడికించిన పచ్చి బఠాణీ- అర కప్పు
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
- గరంమసాలా - అర టీ స్పూన్
- జీలకర్రపొడి-అర టీ స్పూన్
- ఆమ్ చూర్ పొడి - అరటీ స్పూన్
- ధనియాల పొడి - ఒక టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - పావు కప్పు
మిక్స్డ్ వెజిటబుల్ తయారీ విధానం
గోధుమపిండిలో ఉప్పు, కొద్దిగా నూనె, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మరోవైపు పాన్ లో నూనె వేడి చేసి క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి తరుగు, పచ్చిబఠాణీ, పన్నీర్ తరుగు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్.. ఒక్కొక్కటిగా వేసి వేగించాలి. ముక్కలు ఉడకడానికి పైనుంచి కొన్ని నీళ్లు చల్లొచ్చు. ఇవేకాకుండా నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు.
మిశ్రమం ఉడికాక ధనియాలు, జీలకర్ర, ఆమ్ చూర్ పొడులు, కొత్తిమీర తరుగు వేసి రెండు నిమిషాలు మగ్గబెట్టాలి. తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీ మాదిరిగా వత్తి, వాటి మధ్యలో ఈ మిక్స్ వెజిటెబుల్ స్టఫ్ పెట్టాలి. చివర్లను దగ్గరగా మడిచి, మళ్లీ చపాతీ కర్రతో నెమ్మదిగా వత్తాలి. పెనంపై నూనె చల్లుతూ పరాటాలను రెండువైపులా కాల్చాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు తినాలి.
పాలక్ పరాటా తయారీకి కావలసినవి
- గోధుమపిండి-ఒకటిన్నర కప్పు
- నెయ్యి - రెండు టీ స్పూన్లు
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- వాము - అరటీ స్పూన్
- ఉప్పు -తగినంత
- నూనె - సరిపడా
- పాలకూర తరుగు- రెండు కప్పులు
- అల్లం తరుగు -పావు టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు -ఒక టీ స్పూన్
పాలక్ పరాటా తయారీ విధానం
ముందుగా పాలకూర, పచ్చిమిర్చి, అల్లం తరుగును నూనెలో వేగించాలి. ఈ మిశ్రమం చల్లారాక పేస్ట్ లా గ్రైండ్ చేయాలి. మరోవైపు వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, వాము, జీలకర్ర పొడి, ఉప్పు, నెయ్యి, సరిపడా నీళ్లు పోసి కలపాలి. అందులో పాలకూర పేస్ట్ వేసి మిశ్రమం బాగా కలపాలి. దానిపై తడిబట్ట కప్పి పావు గంట పక్కనబెట్టాలి. తర్వాత పిండిని మరోసారి కలిపి చిన్నచిన్న ఉండలు చేయాలి. వాటిని చపాతీల్లా వత్తి పెనంపై నూనె చల్లుతూ రెండువైపులా కాల్చాలి. వీటికి రైతా లేదా చట్నీ బెస్ట్ కాంబినేషన్.
