యువత తప్పు దారి పడుతోంది.. యువత చెడిపోతోంది.. అని ఆందోళన చెందే సమాజం.. హైదరాబాద్ రామంతాపూర్ ఘటన చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకోక తప్పదు. యువత కాదు.. అంతకంటే ఎక్కువ మైనర్లు చెడు వ్యవసనాలకు బానిసలవుతున్నారనే సత్యాన్ని అంగీకరించాల్సిందే. తిప్పి కొడితే పదేళ్లు కూడా లేని బాలుడు.. వాడి చేతిలో సిగరెట్ ఏంటి..? ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగటమేంటి..? అందులో గంజాయి నింపుకుని సేవిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రామాంతాపూర్‌లో ఒక బాలుడు దర్జాగా రోడ్డు పక్కన కూర్చొని సిగరెట్ తాగుతున్న వీడియో కలకలం రేపింది. చిన్న వయసులో సిగరెట్‌లో గంజాయి నింపి సేవిస్తున్నట్లు ఆరోపణలతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి భయం లేకుండా సిగరెట్ తాగుతున్న బాలుడిని ఒక వ్యక్తి మందలించే ప్రయత్నం చేశాడు. చేసిందే తప్పు. అందులో మందలించిన వ్యక్తిపై మైనర్ ఎదురుతిరగటం చూస్తుంటే.. పిల్లల మానసిక ప్రవర్తన ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ సిటీలో చిన్నారుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంజాయి సరఫరాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎస్ఆర్ నగర్ లో 2.3 కిలోల గంజాయి:
మరోవైపు ఎస్ నగర్ లో 2.3 కిలోల గంజాయి లభ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడితో సహా 6 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముఠా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్యాకింగ్, రవాణా, విక్రయాల్లో నిందితుల పాత్ర ఉన్నట్లు తేల్చారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
