హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం ( జూన్ 25 ఉదయం 10 గంటల సమయంలో) జూబ్లిహిల్స్ ఏరియాలో చిరు జల్లులు పడుతున్నాయి. నిన్నా మొన్నటి దాకా .. వేడి.. ఉక్కపోతతలో ఇబ్బంది పడిన ప్రజలు సేద తీరుతున్నారు.
హైదరాబాద్‌లో ఉదయం నుంచే చినుకులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముండటంతో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా .. జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల్లో ( జూన్ 27 నుంచి) భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది
వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
