సరిహద్దుగ్రామాల్లో ‘సర్’కు ఆటంకాలు

సరిహద్దుగ్రామాల్లో ‘సర్’కు ఆటంకాలు
  • ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివిధ గ్రామాల్లో బీఎల్​ఓలకు సహకరించని జనం
  • ఎన్యుమరేషన్​ ఫారాలు తీసుకునేందుకు నిరాకరణ
  • ఒకే చోట ఓటుహక్కు ఉంటుందనడంతో వాగ్వాదం
  • పలుచోట్ల ఇప్పటికీ అందని ఎన్యుమరేషన్​ ఫారాలు

నెట్​వర్క్, వెలుగు: సరిహద్దు గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్​జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ప్రజలు తమకు ఏమాత్రం సహకరించడం లేదని బీఎల్​వోలు చెప్తున్నారు. ఇక్కడి 12 గ్రామాల ప్రజలు ఇన్నాళ్లూ రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు రెండు చోట్ల సంక్షేమ పథకాలు పొందుతున్నారు.

కానీ, సర్​తో ఇకపై ఏదో ఒక చోట మాత్రమే ఓటుహక్కు ఉంచుకోవాలని చెప్తున్న బీఎల్​ఓలతో వాగ్వాదాలకు దిగుతున్నారు. సర్​ఫారాలు తీసుకోవడానికి నిరాకరించడంతో వారికి అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కెరమెరి మండలం పరిధిలో పరందోళి, ముకద్దంగూడ, మహారాజ్ గూడ, కోట, అంతాపూర్, ఇంద్ర నగర్, ఏసాపూర్, నారాయణగూడ, బోలా పటార్, గౌరి, లెండిగూడ, పద్మావతి గ్రామాల్లో ప్రజలకు తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ ఓట్లు ఉన్నాయి.

ఈ 12 వివాదాస్పద గ్రామాల్లో 3,456 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే చోట ఓటు ఉంటుందనడంతో చాలా గ్రామాల్లో ప్రజలు బహిష్కరిస్తామంటున్నారు. పరందోళి, ముకద్దంగూడ, కోట, లెండిగూడ గ్రామాల్లో నాన్​ ట్రైబల్స్ సర్ ప్రక్రియను అడ్డుకుంటున్నారు. గిరిజనేతరులకు 2014 కు ముందు ఇచ్చిన పహణీలను రద్దు చేయడంవల్ల రుణాలు, రైతు బంధు, బీమా లాంటి స్కీమ్​లు అందడం లేదని, ఇరు రాష్ట్రాల అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

లేకపోతే సర్ కు సహకరించబోమని అంటున్నారు. ఒకే చోట ఓటు నమోదు చేసుకుంటే ఒకే రాష్ట్రానికి చెందిన పథకాలు అందుతాయని ఈ గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారికి అవగాహన కల్పించి సర్​లో పాల్గొనేలా అధికారులు నచ్చజెప్పనున్నారు.

  •    యాదాద్రి జిల్లాలో ఏడు పోలింగ్ సెంటర్లకు ఫారాలు రాలేదు. కొన్ని ఫారాల ప్రింటింగ్ స్పష్టంగా రాకపోవడంతో వాటిని తిప్పిపంపారు. 
  •    ములుగు జిల్లాలో 12 పోలింగ్​సెంటర్లకు ఫారాలు రాలేదు. సాయంత్రం వరకు అందుతాయని అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లకు ఫోన్లు చేసి సమాచారం అందిస్తున్నారు. 
  •    వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో బీఎల్​వోలు ఫారంలు ఇచ్చి ఓటర్లు నింపుకోవాలని చెప్పడంతో చదువు రాని వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. 
  •    ప్రస్తుతం కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సర్ అప్లికేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నారు. పంపిణీ సమయంలో ఎక్కువగా ఓటర్లు అడ్రస్ మార్పు గురించి అడుగుతున్నారు. నాలుగైదేండ్లలో పెళ్లయిన మహిళలు తమ పుట్టింటి     నుంచి అత్తారింటికి ఓటును ఎలా మార్చుకోవాలని అడుగుతున్నారు. ఓటరు జాబితాల్లో చనిపోయిన వారి పేర్లుంటే బీఎల్వోలు వివరాలు రాసుకుంటున్నారు.