
ఇతర వర్గాలలో లేని రిజర్వేషన్ల వర్గీకరణ ఎస్సీలలోనే ఎందుకని ప్రశ్నించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీల జనాభా పెరిగిందని, అయినా కూడా పాత లెక్కలతోనే రిజర్వేషన్లు అందిస్తున్నారని అన్నారు. ఎస్సీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లలో వాటా పెంచి అప్పుడు వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి మాలల ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్.
దళితులను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారని, అందుకే విడదీసి రాజకీయ లబ్ది పొందాలని పార్టీలు నాయకులు చూస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఇలాంటి సమయంలో హక్కులను కాపాడుకోవడానికి ఏకథాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ‘మాలల సింహ గర్జన’ మీటింగ్ తర్వాత మాలలకు ధైర్యం వచ్చిందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణతో ఆర్డినెన్స్ లు, జీవోలు తెచ్చారని.. ఈ ఆర్డినెన్స్ వలన, జీవోల వలన అన్యాయం జరిగిందని తాము పోరాడుతున్నామని అన్నారు. మాలలకు సరైన వాటా కోసం పోరాడుతున్నామని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు పెంచితే మాలలకు సరైన వాటా, ప్రాతినిథ్యం వస్తుందని అన్నారు. అందుకోసం ఏపీలో కూడా కొట్లాడాల్సి అవసరం ఉందని అన్నారు.
హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో వర్గీకరణ చేసినప్పుడు .. దళితుల సంఖ్యకు తగినట్లు వాటా పెంచిన తర్వాతనే రిజర్వేషన్ల వర్గీకరణ చేశారని.. తెలంగాణలో కూడా వాటా పెంచాల్సిందేనని అసెంబ్లీ తీర్మానం సందర్భంగా స్పష్టంగా చెప్పానని అన్నారు.
తెలంగాణ, ఏపీలో కూడా ఎస్సీ రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడితేనో, మీటింగ్ లు జరిగితేనో న్యాయయం జరగదని.. కొట్లాడితేనే న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగింది: చిత్తూరు మాజీ ఎంపి రెడ్డప్ప
ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగిందని చిత్తూరు మాజీ ఎంపి రెడ్డప్ప మండిపడ్డారు. వర్గీకరణ వలనపిల్లల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. తిరుపతి మాలల ఆత్మీయ సభలో పాల్గొన్న రెడ్డప్ప.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితుల కోసం కొట్లాడిన వారిలో అంబేద్కర్ తరువాత కాకా వెంకట స్వామి గుర్తుకు వస్తారని అభిప్రాయపడ్డారు. వివేక్ విద్యావేత్త, వ్యాపార వేత్త అని.. రాజకీయాలలో నిస్వార్థ సేవాపరుడు అని కొనియాడారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉన్న నేత వివేక్ వెంకట స్వామి అని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.