- 2026–27 లో పంటల రుణ పరిమితి ఖరారు .. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను రిలీజ్ చేసిన టీజీకాబ్
హైదరాబాద్, వెలుగు: 2026-–27 ఆర్థిక సంవత్సరానికి గాను పంటల సాగుకు అవసరమైన రుణ పరిమితులను నిర్ధారిస్తూ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(టీజీకాబ్) స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను రిలీజ్చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) సమావేశంలో బ్యాంకర్లు, నాబార్డ్ ఆఫీసర్లు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, అగ్రికల్చర్వర్సిటీ నిపుణులు పాల్గొన్నారు. వివిధ పంటల సాగుకు ఖర్చు, దిగుబడి, ప్రాంతీయ పరిస్థితులను బట్టి వ్యవసాయ, ఉద్యాన పంటల రుణ పరిమితులను ఖరారు చేశారు.
రైతులకు ఇచ్చే పంట రుణాల పరిమితిని నిర్ణయించడంలో ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కీలకంగా పని చేస్తుందని కమిటీ పేర్కొంది. దీని ఆధారంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను అనుసరించాలని సూచించింది. జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ(డీఎల్టీసీ)లు సైతం ఇవే మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది.
ఎకరా వరి(సాధారణ సాగు)కి రూ.48 వేలు, ఎస్ఆర్ఐ పద్ధతిలో రూ.38 వేలు, విత్తనోత్పత్పత్తికి రూ.51 వేలు, డీఎస్ఆర్పద్ధతిలో రూ.45 వేలు, పత్తి (నీటి వసతి)కి రూ.52 వేలు, వర్షాధారం అయితే రూ.50 వేలు, విత్తనోత్పత్తికి రూ.1.50 లక్షలు, ఆయిల్ పామ్(ఐదో ఏట నుంచి) రూ.50 వేలు, మిరపకు రూ.90 వేలు, మిరప మల్చింగ్ అయితే రూ.లక్ష, మొక్కజొన్న(నీటి వసతి)కు రూ.38 వేలు, వర్షాధారం అయితే రూ.32 వేలు, విత్తనోత్పత్తి/ స్వీట్ కార్న్ అయితే రూ.43 వేలు, కంది(నీటి వసతి)కి రూ.27 వేలు, వర్షాధారం అయితే రూ.23 వేలు, ఆర్గానిక్ అయితే రూ.25 వేలు, పెసలు(నీటి వసతి)కు రూ.20 వేలు, ఆర్గానిక్ అయితే రూ.22 వేలు, పసుపునకు రూ.92 వేలు, టమాటకు రూ.58 వేలు, ఉల్లిగడ్డకు రూ.49 వేలచొప్పున పంట రుణ పరిమితులు ఖరారయ్యాయి.
