- ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఉచితంగా లేదంటే 50% రాయితీతో రవాణా సౌకర్యం
- సామాన్యుడు భరించలేని స్థాయిలో వైద్య ఖర్చులు
- ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో నెలపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలి
- 20 ఏండ్ల ఆరోగ్యశ్రీ డేటాతో 65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు
- సంక్షేమ పథకాలకంటే పేదలు తమ కాళ్లపై నిలబడేలా చేయడమే మా లక్ష్యం
- కోకాపేటలో మెడికవర్ ఆస్పత్రి ప్రారంభం
- వైద్యులు రోబోల్లా మారొద్దని.. మానవత్వం చూపాలని హితవు
హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలో వచ్చే ఏడాది నుంచి సరికొత్త మార్పులు తేబోతున్నామని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ విధానాన్ని రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తెస్తామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే నూతన విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. డ్రాప్ అవుట్స్ ను తగ్గించడానికి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.
కూలి పనులకు వెళ్లే పేదల పిల్లల కోసం ఉదయం పూట పాలు, నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ తో పాటు మధ్యాహ్నం ఆరోగ్యకరమైన భోజనం పెడతామని చెప్పారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లు విధిగా ఏడాదిలో నెల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం కోకాపేటలో మెడికవర్ హాస్పిటల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విధానంవల్ల కార్పొరేట్ వైద్యులకు ఉన్న అపార అనుభవం పేదలకు అందుతుందని, ప్రభుత్వ వైద్యవ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటీ ముప్పై లక్షల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. గత ఇరవై ఏండ్ల ఆరోగ్యశ్రీ రికార్డులను క్రోడీకరించి, 65 లక్షల మందికి ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయబోతున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతంలో క్లస్టర్ విధానం ద్వారా తొలుత ఈ నూతన విద్యావిధానం, రవాణా వ్యవస్థను అమలు చేయబోతున్నామని వివరించారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించినప్పుడే మన యువత ప్రపంచంతో పోటీ పడగలుగుతుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు పంచడం కంటే, వారిని తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రభుత్వ అసలైన లక్ష్యమని సీఎం అన్నారు.
చదువుల్లో నాణ్యత ఏదీ..?
రాష్ట్రంలో 26 వేల పాఠశాలలు, 21 లక్షల మంది విద్యార్థులున్నారని, ప్రస్తుతం అందుతున్న యాంత్రికమైన విద్య తల్లిదండ్రులకు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వడం లేదని సీఎం చెప్పారు. ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి ఇచ్చిన నివేదిక ప్రకారం మన విద్యా ప్రమాణాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని, మూడో తరగతి చదువుతున్న పిల్లలకు రెండో తరగతి పుస్తకం ఇస్తే కేవలం 5 నుంచి 6 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నారన్నారు.
ఐదేండ్లు నిండితేనే ఒకటో తరగతిలో చేర్చుకునే పాత ప్రభుత్వ నిబంధనల వల్ల పేద విద్యార్థులు కార్పొరేట్ పిల్లలతో పోటీ పడలేక వెనుకబడిపోతున్నారని చెప్పారు. మరోవైపు ఏటా 1.50 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలు పుచ్చుకుంటున్నా, అందులో 20 శాతం మందికి కూడా సర్టిఫికెట్‌కు తగ్గ నైపుణ్యాలు ఉండటం లేదన్నారు. ఈ గ్యాప్‌ను పూడ్చడానికే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ లో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామన్నారు.
ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా ఉన్న ఈ వర్సిటీలో అపోలో, డాక్టర్ రెడ్డీస్, బ్యాంకింగ్ రంగాల నిపుణులు నేరుగా కరిక్యులమ్ డిజైన్ చేస్తున్నారని వివరించారు. శిక్షణ పొందిన విద్యార్థుల్లో 90 శాతం మందికి ఆయా కార్పొరేట్ సంస్థలే ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థను రూపొందించినట్టు చెప్పారు. వర్సిటీ రోజువారీ కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఐటీఐలకు మహర్దశ.. వైద్యానికి పెద్దపీట..
1956లో ఏర్పాటు చేసిన ఐటీఐలలో ఇప్పటికీ అంబాసిడర్ కార్ల రిపేర్ లాంటి కాలం చెల్లిన సాంకేతికతనే నేర్పుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అందుకే పాత సిలబస్‌ను రద్దు చేసి టాటా సంస్థ భాగస్వామ్యంతో ఐటీఐలను ఏటీసీలుగా (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్) అప్ గ్రేడ్ చేశామన్నారు. రూ.2,400 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టగా, టాటా సంస్థ సీఎస్ఆర్ కింద 2,100 కోట్లు పెట్టుబడి పెడుతుందని, ప్రభుత్వ వాటా కేవలం 14 శాతం మాత్రమేనని తెలిపారు.
ఇప్పటికే 65 సంస్థలను ప్రారంభించామని, భవిష్యత్‌లో పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈ ఆధునిక వ్యవస్థ కిందికి తీసుకువస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడుతున్నాయని, అందుకే బ్లూ కాలర్ జాబ్స్‌కు యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రోబోల్లా మారొద్దు.. మానవత్వం చూపండి..
దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం కేవలం హైద రాబాద్ నుంచే జరగడం మనకు గర్వకారణ మని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో మూడు కీలక వ్యాక్సిన్లు మన జీనోమ్ వ్యాలీ నుంచే రావ డం మన సత్తాకు నిదర్శనమన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పీవీ నరసింహారావు తీసుకువచ్చిన సరళీకరణ విధానాలే నేటి హైదరాబాద్ అభి వృద్ధికి బలమైన పునాదులు వేశాయని ప్రశంసిం చారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని పూర్తి చేసి ఈ నగరాన్ని అద్భుతమై న ఐటీ హబ్ గా మార్చారన్నారు.
దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న మెడికవర్ హాస్పిటల్స్ కోకాపేటలో ఏర్పాటు కావడం నగర వైద్య సదు పాయాలను మరింత బలోపేతం చేస్తుందని సీఎం ఆకాంక్షించారు. వైద్య వృత్తిలో ఉన్నవారు యాంత్రికంగా రోబోల్లా కాకుండా, రోగులకు మానవత్వంతో సేవలు అందించాలన్నారు. ఇంట్లో మహిళల ఆరోగ్యం బాగుంటే ఆ కుటుం బం మొత్తం బాగుంటుందని, తద్వారా ప్రభు త్వం ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరమే రాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతున్నయ్..
సామాన్యులు భరించలేని స్థాయిలో హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ కింద తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.1,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఉస్మానియా, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించినట్టు చెప్పారు.
మెడికవర్ 25వ ఆసుపత్రి ప్రారంభం
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిక్ట్రిక్ట్లో కొత్తగా నిర్మించిన మెడికవర్ ఆస్పత్రిని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో దేశంలో మెడికవర్ ఆస్పత్రుల సంఖ్య 25కు చేరింది. ఈ ఆస్పత్రిలో 5 సెకన్లలోనే గుండె పూర్తిగా స్కాన్‌చేసే అత్యాధుని స్కానింగ్ టెక్నాలజీని తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. 640- స్లైస్ సీటీ స్కాన్ సాంకేతికతను ఏర్పాటు చేసి మరింత స్పష్టమైన, వేగవంతమైన, కచ్చితమైన రిపోర్ట్‌ను అందించనున్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ ఆస్పత్రు మేనేజింగ్ డైరెక్టర్ జి.అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని ప్రారంభించామని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ఎ.శరత్ రెడ్డి మాట్లాడుతూ.. 640 -స్లైస్సీటీ స్కాన్, వేగవంతమైన హార్ట్ స్కానింగ్ వంటి ఆధునిక సాంకేతిక తతో కచ్చితమైన నిర్ధారణ చేసి రోగులకు సమయానికి చికిత్స అందిస్తామన్నారు.
