E20 దెబ్బకు పెట్రోల్ కార్లకు తగ్గిపోయిన డిమాండ్.. డీలర్ల దగ్గర కుప్పలుగా స్టాక్

E20 దెబ్బకు పెట్రోల్ కార్లకు తగ్గిపోయిన డిమాండ్.. డీలర్ల దగ్గర కుప్పలుగా స్టాక్

భారత్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ మార్కెట్‌లో పరిస్థితులు పూర్తిగా మారాయి. ముఖ్యంగా E20 పెట్రోల్‌పై పెరుగుతున్న ఆందోళనలతో పెట్రోల్‌ కార్ల డిమాండ్‌పై ప్రభావం పడిందని డీలర్లు చెబుతున్నారు. దీంతో ఒకవైపు CNG, ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుండగా.. మరోవైపు డీజిల్‌ కార్లపై ఆసక్తి మళ్లీ పెరుగుతోంది కార్ లవర్స్ లో. ఫలితంగా పెట్రోల్‌ మోడళ్లను ఎక్కువగా స్టాక్‌ చేసుకున్న డీలర్లు ఇప్పుడు పాతబడుతున్న ఇన్వెంటరీతో అమ్ముకోవటానికి తిప్పలు పడుతున్నారు.

డీలర్ల దగ్గర భారీగా పెట్రోల్ కార్ల స్టాక్..
ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (FADA) ప్రకారం.. డీలర్‌షిప్‌లలోని ప్యాసింజర్‌ వెహికల్‌ స్టాక్‌లో నాలుగో వంతుకు పైగా 60-70 రోజుల వయసున్నదిగా మారింది. సాధారణంగా 30-33 రోజుల ఇన్వెంటరీ సైకిల్‌ ఉండాలి. FADA మాత్రం సుమారు 21 రోజుల స్టాక్‌ మాత్రమే ఉంచుకోవాలని సూచిస్తోంది. దీంతో ప్రస్తుతం డీలర్ల పెట్టుబడి భారీగా పాతవి అవుతున్న వాహనాల్లో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పెట్రోల్‌ మోడళ్లపై ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది.

పెట్రోల్‌కు ప్రత్యామ్నాయాల వైపు కస్టమర్లు..
జూలైలో తయారీదారులు డీలర్లకు 4లక్షల 69వేల ప్యాసింజర్‌ వాహనాలను పంపగా.. రిటైల్‌ విక్రయాలు 4లక్షల16వేల యూనిట్లుగా ఉన్నాయి. అంటే 52 వేలకుపైగా కార్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. అయితే కేవలం అధిక డిస్పాచెస్‌ వల్లే స్టాక్‌ పెరగడం లేదని డీలర్లు చెబుతున్నారు. వినియోగదారుల ఇంధన ఎంపికల్లో వస్తున్న మార్పు కూడా కీలక కారణంగా మారింది. గతేడాది పెట్రోల్‌, ప్రత్యామ్నాయ ఇంధనాల మధ్య వాటా తేడా 13 శాతం ఉండగా.. ప్రస్తుతం అది కేవలం 1 శాతానికి చేరింది. గ్రీన్ ఎనర్జీ కార్ల వాటా 40.59 శాతానికి చేరగా, పెట్రోల్‌ వాటా 41.68 శాతంగా ఉంది.

E20 భయంతో డీజిల్‌కు మళ్లీ డిమాండ్..
E20 అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపడం. దీనిపై వినియోగదారుల్లో ఏర్పడుతున్న ఆందోళన డీజిల్‌ వాహనాలకు మళ్లీ గిరాకీ పెంచుతోంది. జూలైలో డీజిల్‌ కార్ల మార్కెట్‌ వాటా 17.73 శాతంగా ఉండగా.. వరుసగా గత నెలతో పోలిస్తే 1.4 శాతం పాయింట్లు పెరిగింది. డీజిల్‌లో ప్రస్తుతం ఇలాంటి ఇథనాల్‌ బ్లెండింగ్‌ లేకపోవడం కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా SUVల విషయంలో మెరుగైన మైలేజీ, అధిక టార్క్‌ కారణంగా డీజిల్‌పై ఆసక్తి కొనసాగుతోంది.

కంపెనీలకు మారుతున్న ఇంధన మిక్స్‌ సవాలు..
మొత్తంగా ప్యాసింజర్‌ వాహనాల డిమాండ్‌ బలంగానే ఉన్నప్పటికీ.. ఏ ఇంధన వాహనాలకు డిమాండ్‌ ఉందన్న విషయంలో మాత్రం భారీ మార్పు కనిపిస్తోంది. CNG, ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు కస్టమర్లు షిఫ్ట్ అవుతుండటంతో E20 ఆందోళనతో డీజిల్‌ కార్లకు కూడా తిరిగి డిమాండ్ పెరిగింది. 

ALSO READ : ఈ20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు: రాహుల్ గాంధీ

దీంతో పెట్రోల్‌ మోడళ్లను డెడ్ స్టాక్ కాకుండా అమ్ముకునేందుకు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని 2025 మోడల్‌ కార్లపై రూ.లక్షా 50వేలకు మించి రాయితీలు ఉండగా, Tata Curvvపై ఏకంగా రూ.3లక్షల 50వేల వరకు డిస్కౌంట్‌ ఆఫర్ చేసింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఇథనాల్ పెట్రోల్ నిర్ణయం ఇప్పుడు దేశంలోని ఆటో డీలర్లకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లు ఇచ్చి పెట్రోల్ కార్ల స్టాక్ వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.