డీలిమిటేషన్‎పై తగ్గేదే లేదన్న విజయ్ సర్కార్.. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానం

డీలిమిటేషన్‎పై తగ్గేదే లేదన్న విజయ్ సర్కార్.. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానం

చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న డీలిమిటేషన్‎కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం (ఆగస్ట్ 8) సీఎం విజయ్ నేతృత్వంలో జరిగిన తమిళనాడు ఎంపీల అఖిలపక్ష భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు రాష్ట్ర ఎంపీలతో సీఎం విజయ్ (ఆగస్ట్ 8) అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఎండీఎండీకే బహిష్కరించాయి. అధికార టీవీకే కూటమికి చెందిన కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీల ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్ సభ, రాజ్య సభలో రాష్ట్రానికి చెందిన మొత్తం 57 మంది ఎంపీలలో 37 మంది ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

 రాబోయే 40 నుంచి 50 ఏళ్ల వరకు ప్రజాప్రతినిధుల స్థానాల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని.. ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాల సంఖ్యను అలాగే కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిన 1971 జనాభా లెక్కల ప్రకారమే చేయాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు లాంటి ప్రగతిశీల రాష్ట్రాల పార్లమెంటు ప్రాతినిధ్యాన్ని తగ్గించడం అన్యాయమని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.