కూటమి ప్రభుత్వం హెరిటేజ్, ప్రైవేట్ డెయిరీల కోసం... విజయ డెయిరీని బలి తీసుకుంటోంది: సీపీఎం

కూటమి ప్రభుత్వం హెరిటేజ్, ప్రైవేట్ డెయిరీల కోసం... విజయ డెయిరీని బలి తీసుకుంటోంది: సీపీఎం

విజయ పాల ధర పెంపునకు నిరసనగా విజయవాడలో ఆందోళన చేపట్టింది సీపీఎం. కూటమి ప్రభుత్వం హెరిటేజ్ ,ప్రైవేటు డెయిరీ ప్రయోజనాల కోసం విజయ  డయరీని బలి తీసుకుంటోందని ఆరోపించారు సీపీఎం నేతలు. కృష్ణా పాల సహకార సంఘంపై టిడిపి ప్రభుత్వ పెద్దల పెత్తనం చలాయిస్తున్నారని... విజయ డైరీ ఆస్తులపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారని ఆరోపిస్తున్నారు.

నాలుగు నెలల్లో మరోసారి పాల ధరల పెంచడం శోచనీయమని... నాడు అముల్, నేడు హెరిటేజ్ పేరుతో రైతుల, వినియోగదారుల సహకార సంఘాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల కబంధహస్తాల నుండి విజయ డైరీనీ కాపాడుకోవాలి, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకోవాలని అన్నారు.

కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్ విజయ పాల ధరలను ఆగస్టు 10వ తేదీ నుండి లీటర్ కు రెండు రూపాయలు పెంచాలని నిర్ణయం  తీసుకుందని.. ఏప్రిల్ లో లీటర్ రెండు రూపాయలు పెంచిన విజయ డైరీ.. 4 నెలల తిరగక ముందే మరోసారి పెంచడం గర్హనీయమని అన్నారు. పాల ధరల పెంపును విజయ డైరీని కబ్జా చేయడానికి ప్రభుత్వ పెద్దలు.. మంత్రుల ద్వారా చేస్తున్న కుట్రలకు నిరసనగా ఆందోళన చేపట్టామని అన్నారు.

నాలుగు నెలలు తిరగక ముందే మరోసారి పాలధరలు పెంచడం అన్యాయమని... బియ్యం, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని అన్నారు. పాల ధరల పెంపు వల్ల విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలపై సంవత్సరానికి రూ. 36 కోట్లు పడుతుందని, ఏడాదిలో మూడుసార్లు పెంపుతో రూ.100 కోట్ల రూపాయల భారం పడిందని అన్నారు.

అత్యవసరం, నిత్యవసరమైన పాలను కూడా పిల్లలకు, సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం దుర్మార్గమని అన్నారు. హెరిటేజ్, ప్రైవేటు డైరీలను ప్రోత్సహిస్తూ సహకార సంఘాలను ప్రభుత్వంలోని పెద్దలు నాశనం చేస్తున్నారని.. రాష్ట్రంలో ఎన్నో సహకార సంఘాలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేటు డైరీల ,పాలకుల కుట్రలు ఎదుర్కొని విజయ డైరీ ,కృష్ణ సహకార సంఘం నిలబడిందని.. లక్షా 50వేల మంది రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ డైరీని కబ్జా చేయటానికి కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని అన్నారు.