- పది రోజుల్లోనే చేరిన 25 టీఎంసీలు
- మరికొంత పెరిగితే నీటి విడుదల
- ఆయకట్టు రైతుల్లో హర్షం
నిజామాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సగం నిండింది. మొత్తం 80.5 స్టోరేజ్ కెపాసిటీ గల రిజర్వాయర్‌లో 40 టీఎంసీల నీరు చేరింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోతే ఈ సీజన్ ఎలా సాగు చేయాలని టెన్షన్ పడ్డ ఆయకట్టు రైతులు ఇప్పుడు ఊరటచెందుతున్నారు. జలాశయంలోకి మరికొంత నీరు వస్తే ఆయకట్టు పంటలకు సాగునీరు రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో రైతులు ధీమాతో ఉన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన స్వామ్(స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ మేనేజ్‌మెంట్) మీటింగ్‌లో ఎస్సారెస్సీపై వివరాలు తీసుకున్నారు.
రెండు నెలలు కలవరం
వానాకాలం మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీ వాటర్ లెవల్స్ పూర్తి నిరాశజనకంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కెపాసిటీ 14.7 టీఎంసీలుగా కాగా.. కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జూన్ నెలంతా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. జులై 1న మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసినప్పటికీ వర్షాలు లేక గోదావరి నదిలో నీటి ప్రవాహం చెప్పకోదగ్గ రీతిలో పెరగలేదు. ఇన్‌ఫ్లోకు దాదాపు సమానంగా ప్రతి రోజు 973 క్యూసెక్కుల నీటిని భగీరథ స్కీమ్‌కు వదిలారు.
తాగునీటి అవసరాలకు ఏటా 6.5 టీఎంసీలు అవసరం కాగా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు టెన్షన్ పెట్టాయి. కానీ జులై 27 తర్వాత కురిసిన వర్షాలు భారీ ఊరట కల్పించాయి. ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. గత పది రోజుల్లో గోదావరి నుంచి వచ్చిన ఇన్‌ఫ్లోతో ఎస్సారెస్పీలోకి 40 టీఎంసీల మేర నీరు చేరింది. కేవలం పది రోజల వ్యవధిలో దాదాపు 25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. నిరుడు ఈ టైంలో
కూడా ఇదే లెవెల్‌ల్లో వాటర్ స్టోరేజీ ఉంది.
మరో 10 టీఎంసీలు పెరిగితే నీటి విడుదల
గోదావరి నదిపై మహారాష్ట్రలో గైక్వాడ్, విష్ణుపురి, బాలేగావ్, బాబ్లీ తదితర మొత్తం 14 బ్యారేజీలు ఉన్నాయి. అవి పూర్తిగా నిండితే నదిలో ప్రవాహం పెరిగి నేరుగా ఎస్సారెస్పీకి చేరుతాయి. ప్రస్తుతం గైక్వాడ్ ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. గరిష్టంగా 2 టీఎంసీ స్థాయిలోని మిగితా బ్యారేజీలు కూడా నిండితే శ్రీరాంసాగర్‌కు భారీ వరద వస్తుంది.
గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాలో మంచి వర్షాలు పడే సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఎస్సారెస్పీలో వాటర్ లెవల్స్ మరింత వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. మరో 10 టీఎంసీలు వస్తే ఆయకట్టు పంటలకు సాగు నీరు రిలీజ్ చేయాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తుండడంతో రైతులు సంతోషంతో ఉన్నారు.
