5 స్టార్ హోటల్ లో కూరగాయలపై బూజు.. డేట్ ముగిసిన పాలు : ఇంత దరిద్రంగా ఉన్నారేంట్రా

  5 స్టార్ హోటల్ లో కూరగాయలపై బూజు.. డేట్ ముగిసిన పాలు : ఇంత దరిద్రంగా ఉన్నారేంట్రా

అది 5 (ఫైవ్) స్టార్ హోటల్.. కల్తీకి, నకిలీకి అతీతంగా అనే భ్రమలో ఉంటాం.. ఏదైనా మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుందనే ఆలోచనలో ఉంటాం.. తాజా కూరగాయలు అని.. అప్పటికప్పుడు పిండిన పాలు అని.. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే నూనె అని.. ఇలా ఎన్నోన్నో ఊహించుకుంటాం.. ఎందుకంటే అది ఫైవ్ స్టార్ హోటల్.. అందుకే ధరలు అంతంత ఉంటాయని అనుకుంటాం.. ఇవన్నీ డూపు.. ఇవన్నీ అబద్దం.. ఇవన్నీ భ్రమ అని తేల్చేసింది ఈ ఫైవ్ స్టార్ హోటల్.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడిన ఘోరాలు చూసి.. దేన్నీ నమ్మలేం.. నమ్మకూడదు అని ఫిక్స్ అవుతున్నారు. ఇంతకీ ఈ ఘోరం ఏ నగరంలో జరిగింది.. ఏ హోటల్ లో బయటపడింది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం...

బెంగళూరులోని పేరుమోసిన హై-ఫై హోటళ్లు, స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో వంట గదుల్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. బూజు పట్టిన కూరగాయలు, గడువు ముగిసిన పాలు, ఇతర డేట్ అయిపోయిన(expiry  date)  ఆహార పదార్థాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం (ఆగస్టు 7) బెంగళూరు వ్యాప్తంగా ఉన్న 3-స్టార్, 5-స్టార్ హోటళ్లపై ఈ సోదాలు జరిగాయి. మొత్తం 30 అధికారుల బృందాలు నగరంలోని అన్ని జోన్లలో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టాయి.

తనిఖీల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు:
*హోటల్ కిచెన్లు, ఆహారం నిల్వ చేసే ప్రదేశాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయి.
*కుళ్ళిన పదార్థాలు, ఫంగస్ (బూజు) పట్టిన కూరగాయలను వంట కోసం ఉంచారు. ఒక హోటల్‌లో బేకరీ ఐటమ్స్‌ను మొత్తం  చెత్తబుట్టలో పారవేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
*శాకాహారం, మాంసాహారాన్ని వేర్వేరుగా నిల్వ చేయకుండా నిబంధనల ఉల్లంఘించారు. ఇంకా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు లేబులింగ్‌తో పదార్థాలను వాడుతున్నారు.
*గడువు తీరిన వస్తువులు, గడువు ముగిసిన పాలు, పాల పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌తో పాటు చికెన్, మటన్, చేపలను నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో తేలింది.

ఏ హోటల్‌లో ఎంత పట్టుబడిందంటే 
*ద లలిత్ అశోక్ హోటల్లో  76 కిలోల మాంసం, 200 కిలోల కూరగాయలు, గడువు తీరిన 32 లీటర్ల పాలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
*షాంగ్రి-లా హోటల్లో  15 కిలోల మాంసంతో పాటు  ఫోర్ సీజన్స్ హోటల్లో  19 కిలోల మాంసం సీజ్ చేసారు.
*వివంత బెంగళూరు (వైట్‌ఫీల్డ్)లో  3 కిలోల గడువు తీరిన బేకరీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. 
*తాజ్ యశ్వంత్‌పూర్లో  72 కిలోల మాంసం సీజ్ చేసారు.
*రాడిసన్ బ్లూ (ది ఆత్రియా)లో  అత్యధికంగా 105 కిలోల గడువు తీరిన ఆహారం పట్టుబడింది. ఇందులో 50 కిలోల చికెన్, 23 కిలోల మాంసం, 7 కిలోల చేపలు, 25 కిలోల కూరగాయలు ఉన్నాయి.

ALSO READ : కావేరిపై చీప్ పాలిటిక్స్ చేయను.. చర్చలకు వెళ్లాలన్న ఆలోచన నాదే

ల్యాబ్‌కు సాంపుల్స్.. నోటీసులు జారీ
ఈ డ్రైవ్‌లో భాగంగా చికెన్, మటన్, చేపలు, నూనె, కారం, పసుపు, పాలు, చీజ్ వంటి మొత్తం 35 రకాల ఆహార సాంపుల్స్  సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్ టెస్టింగ్‌కు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లన్నింటికీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ల్యాబ్ రిపోర్ట్‌లు వచ్చాక తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ (FDA) ఇలాంటి హోటళ్లపై కొరడా ఝుళిపించి లైసెన్సులు రద్దు చేస్తున్న తరుణంలో, బెంగళూరులోనూ అధికారులు ఈ దాడులు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.