డబ్బులు రెండింతలు చేస్తామని నమ్మించి.. కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

డబ్బులు రెండింతలు చేస్తామని నమ్మించి.. కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే డబ్బులు రెండింతలు, మూడింతలు చేస్తామని నమ్మించి, ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన అంతరాష్ట్ర ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మీడియాకు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా 'శ్రేయ ఇన్ఫ్రా అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఈ మోసాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా నెట్‌వర్క్ చైన్ సిస్టం ద్వారా కొత్త పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించి, ఆ మొత్తంతోనే పాత వాళ్లకు కొద్దికొద్దిగా చెల్లింపులు చేస్తూ మరింత మందిని నమ్మించింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఏజెంట్లను నియమించి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు.మే 2024 నుంచి ఎటువంటి చెల్లింపులు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి పెట్టుబడిదారులను నిలువునా మోసం చేశారు.

ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీఎస్ (CCS) ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఉత్తరప్రదేశ్‌కు పంపించారు. సెప్టెంబర్ 18న లక్నోలోని నిందితుల నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం లక్నో కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై వారిని కరీంనగర్‌కు తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు.

ఈ శ్రేయ ఇన్ఫ్రా సంస్థ మోసానికి గురైన బాధితులు ఎవరైనా ఉంటే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను లేదా కరీంనగర్ సీసీఎస్ (CCS) పోలీసులను సంప్రదించాలని సీపీ గౌష్ ఆలం సూచించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.