వర్క్ ప్లేస్లో నాలుగు నెలలుగా వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని.. గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారని తీవ్ర మనస్తాపం చెందిన యువతి మానసిక క్షోభతో పురుగుల మందు తాగింది. దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కర్ణాటకలోని మైసూరులో ఈ ఘటన జరిగింది. ఆమె రాసిన నోట్లో తను పనిచేస్తున్న దగ్గర ఎదుర్కొన్న పరిస్థితులను ఆమె వివరించింది.
నాగేశ్వరి అనే ఈ యువతి హినాకల్లోని రిలయన్స్ మార్ట్లో టాటా బ్రాండ్స్ ప్రమోటర్గా పని చేస్తుంది. PPMS ఏజెన్సీ అనే ఒక మార్కెటింగ్ కంపెనీ ద్వారా ఆమె జాబ్లో చేరింది. తన తప్పు లేకపోయినా తనను టార్గెట్ చేసి వేధించారని, సూటిపోటి మాటలతో అందరి ముందు అవమానించారని లేఖలో బాధితురాలు పేర్కొంది.
నాలుగు నెలలుగా వారంలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వకుండా తనను ఇబ్బందిపెట్టారని వాపోయింది. ఎందుకిలా తనను వేధిస్తున్నారని నిలదీసినందుకు తనను ఉద్యోగం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. డాలీ అనే సూపర్ వైజర్ పేరును నోట్లో ఆమె రాసింది. అతని వేధింపులు తట్టుకోలేకనే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆరోగ్యం బాగోలేక ఎమర్జెన్సీ లీవ్ అడిగినా ఇవ్వకుండా తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడని లేఖలో ఆమె ప్రస్తావించింది. గత 15 రోజులుగా నాగేశ్వరి మానసికంగా కుంగిపోయింది.
ఉద్యోగం చేస్తున్న దగ్గర ఎదుర్కొన్న పరిస్థితులు, ఉద్యోగం నుంచి కూడా తీసేయడంతో మరింత మనస్తాపం చెందింది. అందుకే ఇలా అర్థాంతరంగా తనువు చాలించిందని నాగేశ్వరి తల్లి రత్నమ్మ కన్నీరు మున్నీరైంది. తన కూతురికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాగేశ్వరి తల్లి డిమాండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
