హైదరాబాద్: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు ఆహార కల్తీ కేసులను పోలీసులు నమోదు చేశారు. అత్తాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాపూర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ కలీం సయ్యద్ నఖీ(48) పిల్లర్ నెంబర్ 127 దగ్గర మొఘల్స్ బావర్చి హోటల్‌ను నిర్వహిస్తున్నాడు.
ఇందులో మాంసం పదార్ధాలతో పాటు అపరిశుభ్రమైన, అసురక్షితమైన, చాలా కాలం నిల్వ ఉంచిన ఆహారాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందింది. చికెన్ గ్రేవీ, బియ్యం, చికెన్, మటన్, తరిగిన కూరగాయలు ప్లాస్టిక్ బకెట్లు, స్టీల్ గిన్నెలలో డీప్ ప్రీజర్‌ల లోపల అపరిశుభ్రమైన, అసురక్షిత వాతావరణంలో నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
చాలా ఆహార పదార్ధాలు గడ్డకట్టినవి, ఫంగస్ బారిన పడినవి, కుల్లిపోయినవి, చెడిపోయినవి, అవి చాలా రోజులుగా నిల్వ ఉంచబడ్డాయని సూచిస్తున్నాయన్నారు. ఎన్‌ఎంగూడ ప్రాంతంలో అశోక్ సైని(33) బాలాజీ ధాబా టైటానియం అనే రెస్టారెంట్‌లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో తరిగిన క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, వెల్లుల్లి, పుట్టగొడుగులను ప్లాస్టిక్ బకెట్లు, స్టీల్ గిన్నెలలో డీప్ ప్రీజర్లలో అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాలా వస్తువులు కుళ్లిపోయి, చెడిపోయి ఉన్నాయి. ఇవి చాలా రోజులుగా నిల్వ ఉన్నాయని సూచిస్తున్నాయన్నారు.
ఎలుకలు, పిల్లులు తరచుగా ఆ దగ్గరలో తిరుగుతున్నాయని దీని వల్ల ఆహారం తినే వినియోగదారులకు ఇన్ఫెక్షన్ల్ వచ్చే అవకాశం ఉంది. ఎంఎంపహాడీ ఎక్స్ రోడ్స్ ప్రాంతంలో మొహమ్మద్ తాహెర్ ఖురేషి(42) షాహి కళ్యాణి బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో కూడా పోలీసులు తనిఖీలు చేసి మానవ ప్రాణాలకు హాని కలిగించే అపరిశుభ్రమైన సురక్షితం కానీ, చాలా కాలంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వినియోగదారులకు విక్రయిస్తుందని గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
