శనివారం (మార్చి 14) నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల కోసం ఇన్నాళ్లూ ప్రిపేరైన విద్యార్థులు రేపటి పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి.. ఒత్తిడి, టెన్షన్ లేకుండా ఎలా రాయాలో స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. అందరిలాగే ఎగ్జామ్స్ కు రెడీ అయిన విద్యార్థి పరీక్షకు ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదాన్ని నింపింది.
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మీదేవిపల్లి అశోక్ నగర్ లో అప్పం నితీష్ (15) అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని వేళ ఊరేసుకుని చనిపోయాడు. పరీక్షలు ఉన్నాయి కదా.. చదువుకుంటూ ఉంటాడులే అనుకుని ఎవరి పనుల్లో వారు ఉన్న పేరెంట్స్.. విషయం తెలిసి ఒక్కసారిగా కుప్పకూలారు. ఒత్తిడి కారణంగానే చనిపోయాడని గుండెలు బాదుకుంటున్నారు.
లక్ష్మీదేవిపల్లి లోని శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు నితీష్. తన కుమారుడిని అకారణంగా K1 బ్రాంచ్ నుండి K2 బ్రాంచ్ కు మార్చడం వల్లే ఈ ఘోరం జరిగిపోయిందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. బ్రాంచ్ మార్చడం వల్ల మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ల ప్రవర్తన కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని నితీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బ్రాంచ్ మార్చి ఆత్మస్థైర్యం దెబ్బతీసిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
