భద్రాచలం వద్ద గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకున్న అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.50 అడుగుల వరకు చేరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
Also Read : మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన భారీ వరద .. 85 గేట్లు ఎత్తివేత
ఇక.. మహబూబ్ నగర్ జిల్లాలో కీలక ప్రాజెక్ట్ అయిన జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. జూరాల 24 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. లక్ష 36 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో లక్షా 32 వేల క్యూసెక్కులుగా ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం..317.59 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.817 టీఎంసీలు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
