ఫిఫాకు మరో షాక్.. యూఈఎఫ్ఏకు కాన్‌కాకాఫ్ మద్దతు.. జియాని పదవి కోల్పోయే ఛాన్స్?

ఫిఫాకు మరో షాక్.. యూఈఎఫ్ఏకు కాన్‌కాకాఫ్ మద్దతు.. జియాని పదవి కోల్పోయే ఛాన్స్?

FIFA World Cup Plan: ప్రపంచ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా (FIFA) ప్రెసిడెంట్ జియాని ఇన్‌ఫాంటినో ప్రతిపాదించిన వివాదాస్పద ప్లాన్‌కు వరుస షాక్స్ తగులుతున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ కమర్షియల్ హక్కుల్లో ప్రైవేట్ పెట్టుబడిదారులకు భాగస్వామ్యం కల్పించే ప్లాన్‌ను ఐరోపా ఖండపు ఫుట్‌బాల్ సమాఖ్య (UEFA) తీవ్రంగా వ్యతిరేకించగా, తాజాగా ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ ప్రాంతాల ఫుట్‌బాల్ సమాఖ్య CONCACAF కూడా దీనిని తీవ్రంగా ఖండించింది.

CONCACAF తీవ్ర అభ్యంతరం:

ఈ అంశంపై CONCACAF తన 41 సభ్య దేశాల అధ్యక్షులు, కౌన్సిల్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఫిఫా ప్రతిపాదనను తిరస్కరించింది. సభ్య దేశాలపై ఒత్తిడి తెచ్చేలా తక్కువ సమయ పరిమితిని (డెడ్‌లైన్) విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. చరిత్రలోనే అత్యంత లాభదాయకమైన వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత కూడా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల అవసరం ఏమొచ్చిందని CONCACAF నిలదీసింది.

తిరుగుబాటు బాటలో యూరోపియన్ దిగ్గజాలు:

UEFAకు చెందిన 55 సభ్య దేశాలు ఇప్పటికే ఈ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫిఫా గనుక ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో ముందడుగు వేస్తే, ఫిఫా నిర్వహించే మెన్స్, విమెన్స్ వరల్డ్ కప్‌లను బాయ్‌కాట్ చేస్తామని UEFA ఇప్పటికే స్పష్టం చేసింది. దీనివల్ల ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి ప్రపంచ దిగ్గజ జట్లు వరల్డ్ కప్‌కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఫుట్‌బాల్ హక్కులు, పాలనాధికారాలు అమ్మకానికి లేవు అని UEFA తేల్చి చెప్పింది. 

►ALSO READ | ఫుట్‌బాల్‌లో బిగ్ వార్ : FIFA vs UEFA మధ్య అసలు గొడవ ఏంటి?

అసలు ఏంటీ FFE ప్లాన్:

ఫిఫా ప్రెసిడెంట్ ఇన్‌ఫాంటినో ఫిఫా ఫార్వర్డ్ ఎంటర్‌ప్రైజ్ (FFE) అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా వరల్డ్ కప్ టీవీ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, లైసెన్సింగ్‌లను నిర్వహించనున్నారు. FFEలో ప్రైవేట్ ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి $20 బిలియన్ల (సుమారు రూ. 1.6 లక్షల కోట్లు) వ్యాల్యుయేషన్ ఆధారంగా ప్రైవేట్ నిధులు సమీకరించాలని ఫిఫా ప్లాన్ చేసింది.   

ప్రైవేట్ పెట్టుబడులపై ఫుట్‌బాల్ ప్రపంచం ఫైర్:

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రైవేట్ పెట్టుబడిదారుల కార్పొరేట్ జోక్యం పెరిగిపోతుందని, ఈ గేమ్ కమర్షియల్ కావడం వలన ఫుట్‌బాల్ స్వతంత్రత దెబ్బతింటుందని అంతర్జాతీయ సమాఖ్యలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన ఖండాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండటంతో, ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో తన పదవిని కోల్పోయే ప్రమాదం క్లియర్ గా కనిపిస్తుంది.