ఫుట్‌బాల్‌లో బిగ్ వార్ : FIFA vs UEFA మధ్య అసలు గొడవ ఏంటి?

ఫుట్‌బాల్‌లో బిగ్ వార్ : FIFA vs UEFA మధ్య అసలు గొడవ ఏంటి?

FIFA vs UEFA: ఫుట్‌బాల్ ప్రపంచం గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ తమ వాణిజ్య హక్కులను అమ్మేందుకు ఫిఫా (FIFA) వేసిన రూ. వేల కోట్ల ప్లాన్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ను రెండుగా చీల్చేలా కనిపిస్తోంది. ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్‌ఫాంటినో ప్రతిపాదించిన ఫిఫా ఫార్వర్డ్ ఎంటర్‌ప్రైజ్ (FFE) ప్రాజెక్టును యూరప్ సాకర్ పాలకమండలి యూఈఎఫ్‌ఏ (UEFA) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యూరప్‌లోని 55 సభ్య దేశాలు ఈ డీల్‌పై బాయ్‌కాట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవ్వడంతో గ్లోబల్ ఫుట్‌బాల్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఫుట్‌బాల్ అమ్మకానికి కాదు: కీత్ హాకెట్

ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్‌ఫాంటినో ఏకపక్ష నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ రెఫరీ కీత్ హాకెట్ తీవ్రంగా మండిపడ్డారు. ఫుట్‌బాల్ సంస్కృతి, పాలన కేవలం వ్యాపార వస్తువులు కాదని, ఇన్‌ఫాంటినో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులు వస్తే ఆట నియమాలు, నిర్వహణపై వారి ఆధిపత్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిఫా దగ్గర ఇప్పటికే ఉన్న నిధులను క్రికెట్ లాగా భారత్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో గ్రాస్‌రూట్ ఫుట్‌బాల్, నాణ్యమైన మైదానాల అభివృద్ధికి కేటాయించాలని కీత్ హాకెట్ సూచించారు.

నో యూరప్, నో సూపర్‌స్టార్స్: 

స్పోర్ట్స్ లాయర్ ఇస్రేల్ అడెడేజి-అజోజే విశ్లేషణ ప్రకారం ఈ పోరులో యుఏఈఎఫ్ఏకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది.

* కమర్షియల్ వ్యాల్యూ డౌన్: ఫిఫా వేసే బిలియన్ డాలర్ల అంచనాలన్నీ యూరోపియన్ జట్లు (ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ), అగ్రశ్రేణి స్టార్ ప్లేయర్ల లభ్యతపైనే ఆధారపడి ఉన్నాయి.

* ప్లేయర్ల విడుదల నిలిపివేత: UEFA కనుక ఫిఫా టోర్నీల నుంచి తప్పుకుంటే, క్లబ్‌లు తమ స్టార్ ప్లేయర్లను ఫిఫా మ్యాచ్‌లకు పంపే లీగల్ బాధ్యత రద్దవుతుంది. దీని వల్ల ఫిఫా వరల్డ్ కప్, క్లబ్ వరల్డ్ కప్‌ల వ్యాల్యూ దారుణంగా పడిపోతుంది.

పేద దేశాలకు ఆశల ఎర: 

ఇన్‌ఫాంటినో మాత్రం ఆసియా, ఆఫ్రికా దేశాల ఓట్లను నమ్ముకున్నారు. వచ్చే 12 ఏళ్లలో ప్రతీ దేశానికి $88 మిలియన్ల (రూ. 700 కోట్లకు పైగా) నిధులు ఇస్తామని ఎర వేస్తున్నారు. ఇది చిన్న దేశాలకు గోల్డెన్ ఛాన్స్ అయినప్పటికీ, కార్పొరేట్ పెట్టుబడులు పెరిగితే టికెట్ ధరలు ఆకాశాన్నంటుతాయని, సామాన్య అభిమానులకు ఆట దూరమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఓటింగ్‌లో ఫిఫా గెలిచినా, మ్యాచ్‌లు ఆడే స్టార్ ప్లేయర్లు లేకపోతే ఆ రూ. వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ వ్యర్థమే అవుతుంది అని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.