OTT Thriller: థియేటర్లలో మిస్ అయ్యారా? ఐతే ఈ తెలుగు సైకాలజికల్ థ్రిల్లర్ మీ కోసమే

OTT Thriller: థియేటర్లలో మిస్ అయ్యారా? ఐతే ఈ తెలుగు సైకాలజికల్ థ్రిల్లర్ మీ కోసమే

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు ఈ మూవీ ఇవాల్టీ (జూలై 31) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది.

హీరో మహేష్ బాబు సమర్పించిన ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్‌గా నటించింది. వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ మహా దర్శకత్వం, సత్యదేవ్ నటన, స్మరణ్ సాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయిన వారితో పాటుగా సైకాలజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్‌గా మారనుంది.

కథేంటంటే:

ఈ మూవీ కథ ఒక రాజరిక హోదా, పురాతన జమీందారీ వంశం అంతరించిపోతున్న నేపథ్యంలో సాగుతుంది. రామాప్ప (సత్యదేవ్) ఒక వయోవృద్ధుడు, తీవ్రమైన మద్యపాన అలవాటు ఉండి, మానసిక సమస్యలతో బాధపడే జమీందారు. అతనికి కాలేయ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉందని, ఇక కొద్ది నెలలు మాత్రమే బతుకుతాడని వైద్యులు చెబుతారు. వైద్యులు చెప్పిన గడువు దాటిపోయినా రామాప్ప ఇంకా బతికే ఉంటాడు. దానికి కారణం అతనికి తన వంశపారంపర్యం మరియు తన భార్య రేణుక (దీపా థామస్) పట్ల ఉన్న ఒక పీడకల లాంటి అనుమానం. తన చిన్న కొడుకు ‘కుసుమ’ తన సొంత రక్తం కాదేమోననే అనుమానం అతన్ని తీవ్రంగా వేధిస్తుంది.

►ALSO READ | K Jamuna Rani: లెజెండరీ సింగర్ జమునారాణి కన్నుమూత.. 6 వేలకుపైగా పాటలు, బ్రహ్మచారిణిగా జీవితం!

గతం (1961 ఫ్లాష్‌బ్యాక్): ఫ్లాష్‌బ్యాక్‌లో రామాప్ప ఆనాటి సమాజపు మూఢనమ్మకాలకు, పూర్వీకుల ఆత్మల సందేశాలకు బలై ఒక క్లిష్టమైన మానసిక స్థితికి ఎలా చేరుకున్నాడో చూపిస్తారు. ఆ అనుమానాల వల్లనే చిన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడం, దానివల్ల భార్య రేణుక అతనికి దూరమై చీకటి గదిలో గడపడం వంటి తీవ్ర పరిణామాలు జరుగుతాయి.

డిఎన్‌ఏ పరీక్ష (DNA Test) రగడ: తన వంశం యొక్క రక్తం స్వచ్ఛమైనదేనని నిరూపించుకోవాలనే పిచ్చితో, చనిపోయిన కొడుకు అస్థికలను (కటకాన్ని) తవ్వి తీసి డిఎన్‌ఏ పరీక్ష చేయించడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతని డాక్టర్ మరియు స్నేహితుడు ఆచారితో (వికాస్ ముప్పాల) జరిగే మానసిక యుద్ధం, పోలీసుల ఎంట్రీ కథను ఆసక్తికరంగా మలుస్తాయి.

అయితే రామప్ప తన చివరి వరకు లక్ష్యం చేరుకున్నాడా? లేదా? రేణుక (దీపా థామస్)తో అతని ప్రేమకథ ఎలా ప్రారంభమైంది? ఆమె లేకుండా రామప్ప ఎందుకు ఒంటరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది? యవ్వనంలో ఎదురైన అనుభవాలు, ప్రేమ, కుటుంబ బంధాలు అతని జీవితాన్ని ఎలా మలిచాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘రావు బహదూర్’ సినిమా కథ.

సినిమా ఎలా ఉంటుందంటే?

మానసిక సంఘర్షణలు, భావోద్వేగాలు, రహస్యాలతో కూడిన కథాంశంతో తెరకెక్కిన ‘రావు బహదూర్’ ప్రేక్షకులను ఓ విభిన్న ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హీరో తన గతం, వర్తమానం మధ్య చిక్కుకుపోయి ఎదుర్కొనే పరిణామాలు, అతని జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు, వాటి వెనుక దాగి ఉన్న నిజాలు కథలో కీలకంగా మారతాయి. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగాలతో కూడిన ఈ సైకాలజికల్ థ్రిల్లర్ చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది.