కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా ఖమేనీ! ఇజ్రాయెల్ దాడుల్లో కాలు కోల్పోయారా..?

కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా ఖమేనీ! ఇజ్రాయెల్ దాడుల్లో కాలు కోల్పోయారా..?

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చుట్టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం మొదలైన తర్వాత ఆయన తన మొదటి బహిరంగ సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఆ సందేశం ఇరాన్ ప్రజల్లో భరోసా నింపడం కంటే, ఆయన ఆరోగ్యంపై మరిన్ని అనుమానాలను, మిస్టరీని పెంచేసింది. ఫిబ్రవరి 28న జరిగిన భీకర వైమానిక దాడుల్లో ఆయన తండ్రి అలీ ఖమేనీ మరణించగా.. అదే దాడిలో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారనే వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. విచిత్రమేమిటంటే.. అత్యంత కీలకమైన ఈ ప్రకటన ఇరాన్ అధికారిక టీవీలో ప్రసారమైనప్పుడు మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించలేదు. కనీసం ఆయన గొంతు కూడా వినబడలేదు. ఒక న్యూస్ యాంకర్ ఆ సందేశాన్ని చదివి వినిపించడం 'ఘోస్ట్ అయతొల్లా' అనే కొత్త చర్చకు తెరలేపింది.

మొజ్తాబా ఆరోగ్యంపై వస్తున్న నివేదికలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండటం ఈ ఉత్కంఠకు ప్రధాన కారణం. ఇరాన్ మీడియా ఆయనను దేశం కోసం గాయపడిన వీరుడని అభివర్ణిస్తుండగా.. పాశ్చాత్య మీడియా సంస్థలు భయంకరమైన కథనాలను ప్రచురిస్తున్నాయి. రాయిటర్స్ ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని చెబుతుంటే.. సీఎన్ఎన్ మాత్రం ఆయన ముఖంపై గాయాలయ్యాయని, కాలి ఎముక విరిగిందని పేర్కొంది. అయితే బ్రిటీష్ ట్యాబ్లాయిడ్ 'ది సన్' మాత్రం దాడిలో మొజ్తాబా తన ఒక కాలును కోల్పోయారని, కాలేయం, పొట్ట భాగంలో తీవ్ర అంతర్గత గాయాల వల్ల ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని సంచలన కథనాన్ని ప్రచురించింది. టెహ్రాన్‌లోని సీనా యూనివర్సిటీ హాస్పిటల్‌లో భారీ భద్రత నడుమ ఆయనకు చికిత్స అందుతోందని, ఆరోగ్య మంత్రి స్వయంగా ఈ శస్త్రచికిత్సలను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.

అనారోగ్య వార్తలు ఇలా ఉంటే.. విడుదలైన సందేశంలో మాత్రం మొజ్తాబా అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. తన తండ్రి మృతదేహాన్ని చూసినప్పుడు ఆయన పిడికిలి బిగించి ఉందని, ఆ పట్టుదలతోనే తాము ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. అమెరికా ఆస్తులను ధ్వంసం చేస్తామని, అవసరమైతే ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. శత్రువుకు అనుభవం లేని కొత్త యుద్ధ రంగాలను తెరుస్తామని చెప్పడం ద్వారా యుద్ధం మరింత తీవ్రం కాబోతోందని సంకేతాలిచ్చారు. తన భార్య, సోదరి, మేనల్లుడు ఇలా కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన విషయాన్ని ఆవేదనతో ప్రస్తావిస్తూనే.. పొరుగు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఇరాన్ రెవల్యూషినరీ గార్డ్స్ మద్దతుతో మొజ్తాబా పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఆయన ప్రజల ముందుకు రాకపోవడం అనేక ప్రశ్నలను మిగిలిస్తోంది. ఆయన నిజంగానే కోమాలో ఉన్నారా? లేక శత్రువుల నుంచి రక్షణ కోసం అజ్ఞాతంలో ఉండి దేశాన్ని నడిపిస్తున్నారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. స్టేట్ బ్రాడ్కాస్టర్ ద్వారానే తన నియామకం గురించి తెలుసుకున్నానని ఆయన చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. ఇరాన్ చరిత్రలోనే అత్యంత క్లిష్ట సమయం ఎదురైన వేళ ఇది ప్రపంచాన్ని ఏ తీరాలకు చేర్చుతుందో వేచి చూడాల్సిందే.