1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం చరిత్ర సృష్టించిన అరుదైన ఆపరేషన్‌ను తెరపై ఆవిష్కరించేందుకు రూపొందిన వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్' . దర్శకుడు ఓని సేన్ తెరకెక్కించిన ఈ మిలిటరీ డ్రామా, యుద్ధ సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగిన వైమానిక ఆపరేషన్‌ను ఆసక్తికరంగా చూపించబోతోంది. లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ప్రారంభంలోనే పాకిస్థాన్ సైన్యం కార్గిల్-ద్రాస్ ప్రాంతంలోని కీలక శిఖరాలను ఆక్రమించి, శ్రీనగర్-లేహ్‌ను కలిపే జాతీయ రహదారి-1పై దాడులకు దిగినట్లు చూపిస్తారు. పర్వతాలపై ఉన్న శత్రువును కింద నుంచి ఎదుర్కోవడం భారత సైన్యానికి క్లిష్టంగా మారిన వేళ, రంగంలోకి దిగిన భారత వైమానిక దళం పరిస్థితిని ఎలా మార్చిందో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. 'విజయావకాశాలు కేవలం ఐదు శాతమే అయినా, దేశం కోసం చివరి శ్వాస వరకు పోరాడతాం'అనే డైలాగులు దేశభక్తిని రగిలిస్తాయి.
ఈ సిరీస్‌లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా పాత్రలో సిద్ధార్థ్, అప్పటి ఫైటర్ పైలట్‌గా ఉన్న బీఎస్ ధనోవా పాత్రలో జిమ్మీ షెర్గిల్ నటించారు. నిజ జీవిత సంఘటనలు, భారత వైమానిక దళ మాజీ అధికారుల సూచనలు, విస్తృత పరిశోధన ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రూపొందింది. అంతేకాదు, నిజమైన ఎయిర్ ఫోర్స్ బేస్‌లు, యుద్ధ విమానాలు, హై-ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడం వల్ల కథనానికి మరింత వాస్తవికత వచ్చింది.
ఈ సందర్భంగా మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మాట్లాడుతూ.. ఈ కథను భారతదేశం చాలా కాలంగా వినాల్సి ఉంది. 'ఆపరేషన్ సఫేద్ సాగర్' మా వైమానిక దళం ధైర్యసాహసాలకు ప్రతీక. ఆ గాథ ఇప్పుడు ప్రపంచం ముందుకు రావడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దేశభక్తి, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.
