ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బును అలాగే వదిలేశారా? ఎప్పుడో తీసుకోవాలని అనుకుని మర్చిపోయారా? అయితే ఈ వార్త మీ కోసమే. దేశవ్యాప్తంగా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎవ్వరూ క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయి. 2026 మార్చి 31 నాటికి ఇన్‌ఆపరేటివ్ EPF ఖాతాలు, క్లెయిమ్ చేయని LIC పాలసీ మొత్తాలు కలిపి రూ.16వేల649 కోట్లకు చేరాయి. ఇందులో అత్యధికంగా రూ.9వేల 330 కోట్లు ఇన్‌ఆపరేటివ్ PF ఖాతాల్లోనే ఉందని తేలింది.
ఇన్‌ఆపరేటివ్ ఖాతా అంటే ఏమిటి?
ఎంప్లాయి ఉద్యోగం మారిన తర్వాత పాత PF ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేయకపోవడం లేదంటే చాలా కాలం పాటు లావాదేవీలు జరగకపోవడం వల్ల అది "ఇన్‌ఆపరేటివ్"గా మారుతుంది. అయితే EPFO వాటిని "అన్‌క్లెయిమ్డ్"గా పరిగణించదని స్పష్టం చేసింది. అంటే ఆ డబ్బుపై మీ హక్కు అలాగే ఉంటుంది. అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తే ఎప్పుడైనా క్లెయిమ్ చేసి డబ్బు పొందొచ్చన్నమాట.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
పూర్తి PF మొత్తాన్ని ఉపసంహరించుకోవాలంటే ఖాతా కనీసం 2 నెలల పాటు యాక్టివ్‌లో లేకుండా ఉండాలి. అంతకుముందు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే పాక్షికంగా డబ్బు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే UANతో ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా వంటి KYC వివరాలు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఒకవేళ ఖాతా 7 సంవత్సరాలకు పైగా ఇన్‌ఆపరేటివ్‌గా ఉంటే మరికొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎలా క్లెయిమ్ చేయాలి?
ఇన్‌ఆపరేటివ్ PF ఖాతాలోని డబ్బును పొందేందుకు ముందుగా మీ మెంబర్ ఐడీ, PF అకౌంట్ నంబర్, UAN వివరాలను అందించాల్సి ఉంటుంది. అనంతరం EPFO పోర్టల్‌లోకి వెళ్లి Form-19 (ఫైనల్ సెటిల్‌మెంట్), Form-10C (పెన్షన్ ఉపసంహరణ)ను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. UAN లాగిన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత క్లెయిమ్‌ను డిజిటల్‌గా సబ్మిట్ చేయవచ్చు.
UAN లేకున్నా అవకాశం..
UAN లేకపోయినా ఆందోళన అక్కర్లేదు. EPFO వెబ్‌సైట్ నుంచి Form-19, Form-10C డౌన్‌లోడ్ చేసి, అవసరమైన వివరాలు నింపి సమీప పీఎఫ్ ఆఫీసుకు వెళ్లి ఆఫ్‌లైన్‌గా సమర్పించవచ్చు. అవసరమైన పత్రాలను జతచేస్తే క్లెయిమ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ALSO READ : మీనరాశిలో తిరోగమనంలో శని భగవానుడు.. ఎవరికి ఎలా ఉంటుంది..
క్లెయిమ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
దరఖాస్తు సమర్పించిన తర్వాత పీఎఫ్ వెబ్‌సైట్‌లోని ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా మీ పీఎఫ్ క్లెయిమ్ స్థితిని తెలుసుకోవచ్చు. అక్కడ క్లెయిమ్ పెండింగ్‌లో ఉందా, ఆమోదించబడిందా, తిరస్కరించబడిందా, డబ్బు జమ అయిందా అనే వివరాలు కనిపిస్తాయి. మీ కష్టార్జిత సంపాదనను నిర్లక్ష్యం చేయకుండా.. పాత PF ఖాతాలను ఒకసారి పరిశీలించి అవసరమైతే వెంటనే క్లెయిమ్ చేసుకోవడం మంచిది.
