కాల్పుల విరమణ పూర్తయి 10 రోజులు గడుస్తుండగా.. ఒకవైపు చర్చల కోసం ప్రయత్నిస్తున్నాం అంటునే.. మరోవైపు ఇరాన్ ను లొంగదీసుకునేందుకు అమెరికా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇన్నాళ్లు భరించిన కాడికి భరించినం.. ఇక తగ్గేది లేదు.. పూర్తి స్థాయి యుద్ధమే అంటూ తెగేసి చెప్పేసింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రకటించారు. తమ హక్కులు, ప్రయోజనాలు లేదా సూత్రాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం (జులై 20) జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణ కేవలం మిస్సైల్స్ కు సంబంధించినది మాత్రమే కాదని పెజెష్కియన్ అన్నారు. సైనిక చర్యల ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవాలని తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించి విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు. యుద్ధంతో ఇరాన్ ప్రజలను లొంగదీసుకోవడం అంత ఈజీ కాదని అమెరికాకు తెలిసొచ్చిందని అన్నారు.
వాషింగ్టన్ నుంచి ఎంత ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, ఇరాన్ తన వైఖరికి కట్టుబడి ఉంటుందని నొక్కి చెప్పారు. అమెరికాతో ఘర్షనలు తీవ్రమవుతున్న తరుణంలో, దేశం ఐక్యంగా ఉండాలని పెజెష్కియన్ పిలుపునిచ్చారు.
అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. 10 రోజుల యుద్ధ విరమణ ప్రతిపాదనలు మధ్యవర్తుల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. సీజ్ ఫైర్ అగ్రీమెంట్ గురించి పునరాలోచించాలనే ప్రతిపాదనలు వస్తున్నట్లు తెలిపారు.
అమెరికాకు రాయితీలు ఇవ్వలేదు:
ఇటీవల ప్రకటించిన అవగాహన ఒప్పందం కింద టెహ్రాన్ అమెరికాకు కన్సెషన్స్ ఇచ్చిందన్న ఆరోపణలను కూడా పెజెష్కియన్ తోసిపుచ్చారు. అగ్రీమెంట్స్ ఒప్పుకునే క్రమంలో ఇరాన్ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితి లేదని.. దేనిపైనా రాజీ పడలేదని స్పష్టం చేశారు.
ఒకవైపు మధ్యవర్తిత్వం, మరోవైపు ఉద్రిక్తలు
ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ, టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుపక్షాలు మధ్య తీవ్రమైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
