న్యూఢిల్లీ: డ్రగ్స్ మత్తులో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన పైలట్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలడంతో పైలట్‌పై వేటు వేసింది. తక్షణమే అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం (సెప్టెంబర్ 4) ప్రకటించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ఆధారంగా విమాన భద్రత, సిబ్బంది ఫిట్‌నెస్ నిబంధనల ఉల్లంఘనపై ఎయిర్ ఇండియా సంస్థ తీవ్రంగా స్పందిస్తూ ఈ చర్య తీసుకుంది.
అసలేం జరిగిందంటే..?
2026, ఆగస్ట్ 4వ తేదీన ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (AI-2379) విమానం భారీ కుదుపులకు లోనైంది. విమానం అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తు డౌన్ అయ్యింది. ఈ ఘటన సమయంలో ప్లయిట్లో 145 మంది ఉండగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. విమానం గాల్లో ఉండగా మూడు హైడ్రాలిక్ సిస్టమ్స్ ఒకేసారి ఒత్తిడిని కోల్పోవడంతో ఆటోపైలట్ డిస్‌కనెక్ట్ అయి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
►ALSO READ | జమ్మూ కాశ్మీర్లో ఎన్ కౌంటర్.. సైన్యం చేతిలో టెర్రరిస్ట్ హతం
అయితే, విమానం నడిపిన పైలట్ ప్రవర్తనపై అమామానం రావడంతో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించింది. మెడికల్ టెస్ట్‌లో పైలట్‌కు డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. ప్రయాణికుల భద్రతా, నిబంధనల ఉల్లంఘనలో భాగంగా పైలట్‌ను ఎయిర్ ఇండియా తక్షణమే విధుల నుంచి తొలగించింది. ప్రయాణికుల భద్రతా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
